Site icon HashtagU Telugu

Muslim Kar Sevak : ఆ ఇద్దరు ముస్లింలకు అయోధ్య రామమందిరం ఆహ్వానాలు.. ఎందుకంటే..

Muslim Kar Sevak

Muslim Kar Sevak

Muslim Kar Sevak : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపుర్‌‌కు చెందిన మొహమ్మద్‌ హబీబ్‌  వయసు 70 ఏళ్లు. 1992 నాటి అయోధ్య కరసేవలో స్వయంగా పాల్గొన్నారు. ఇటీవల ఆయనకు అయోధ్య నుంచి రామమందిరం ఆహ్వాన లేఖతో పాటు అక్షతలు, రామమందిరం ఫొటో అందాయి. వాటిని చూసి హబీబ్‌తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ప్రాణప్రతిష్ఠ వేడుకను టీవీలో చూస్తా. జనవరి 22 తర్వాత అయోధ్యకు వెళ్లి శ్రీరాముడిని దర్శించుకుంటా’’ అని హబీబ్‌ చెప్పారు. ఈ నెల 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. దీనికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశంలోని వేలాది మంది ప్రముఖులకు ఆలయ ట్రస్ట్ ఆహ్వానాలను పంపింది. ఉత్తరప్రదేశ్‌ మీర్జాపూర్‌లో సాధారణ జీవితం గడుపుతున్న మహ్మద్ హబీబ్‌కు రామాలయ ఆహ్వానం అందడం విశేషం. దీంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా(Muslim Kar Sevak) పోయాయి.

We’re now on WhatsApp. Click to Join.

‘‘నేను కూడా కరసేవలో పాల్గొన్నాను. 1992లో డిసెంబర్ 2న 5 రోజుల పాటు నా టీంతో  కలిసి అయోధ్యలోనే ఉన్నాను. జనవరి 22న జరగబోయే రామమందిర ప్రారంభోత్సవం అనేది ప్రతీ ఒక్కరికీ చారిత్రాత్మక రోజు.  ఎన్నో ఏళ్ల తపస్సు, యుద్ధం తర్వాత మాకు ఈ రోజు వచ్చింది. నేను బీజేపీలో చాలా పాత కార్యకర్తను. మీర్జాపూర్ జిల్లా బీజేపీ యూనిట్‌లో వివిధ పదవుల్లో పనిచేశాను. మరోసారి అయోధ్యలో ఉన్న రోజులు గుర్తుకు వస్తున్నాయి. రాముడు మా పూర్వీకుడు’’ అని మొహమ్మద్‌ హబీబ్‌  వివరించారు. మీర్జాపూర్ పొరుగు జిల్లా వారణాసిలో ముస్లిం మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న ముస్లిం మహిళా ఫౌండేషన్ కార్యకర్త నాజ్నీన్ అన్సారీ రామాలయ వేడుకపై సంతోషం వ్యక్తం చేశారు. మేం శ్రీరాముడి జ్యోతిని తీసుకొచ్చి కాశీలోని హిందూ, ముస్లిం కుటుంబాలకు అందిస్తామన్నారు. ‘‘రాముడు మా పూర్వీకుడు మాత్రమే కాదు.. ఆయన మా మనసులో ఉన్నారు. మనం మతాన్ని మార్చగలం కానీ, పూర్వీకులను మార్చలేం’’ అని నాజ్నీన్ అన్సారీ చెప్పారు.

Also Read: New Ration Cards : కొత్త రేషన్ కార్డుల మంజూరు డేట్ అదేనట ?!

అయోధ్య రామమందిరం వ్యవహారంపై అనేక ఏళ్లపాటు కోర్టులలో వాదనలు ప్రతివాదనలు జరిగాయి. రామమందిరం నిర్మాణాన్ని 70 ఏళ్లనుంచి కోర్టులో వ్యతిరేకించిన కుటుంబానికి కూడా అయోధ్య రామమందిరం నుంచి ఆహ్వానం అందింది. బాబ్రీ మసీదు తరఫున కేసును నడిపిన హాషిం అన్సారీ కుమారుడు ఇక్బాల్ అన్సారీకి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. బాబ్రీ మసీదు తరఫున హాషిం అన్సారీ 1949 నుంచి 2019లో తీర్పు వచ్చే వరకు న్యాయపోరాటం చేశారు. ఈ కేసును వాదిస్తున్నప్పటికీ హిందువులతో హాషిం అన్సారీ సంబంధాలు ఎప్పుడూ క్షీణించలేదు. వివాదాస్పద స్థలం కోసం కేసులు నడిపిన నిర్మోహి అఖారాకు చెందిన రామ్‌కేవల్ దాస్, దిగంబర్ అఖారాకు చెందిన రామచంద్ర పరమహంస్‌తోనూ హాషిం చివరి వరకు సన్నిహితంగా ఉండేవారు.  హషీం అన్సారీ మరణానంతరం ఆయన కుమారుడు ఇక్బాల్ అన్సారీ బాబ్రీ మసీదు పక్షాన్ని కోర్టులో సమర్పించారు. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిచ్చింది.