Tahawwur Rana: 2008 నవంబరు 26న జరిగిన ముంబై ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ తహవ్వుర్ హుస్సేన్ రాణా. ఇతడు పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడు. ఈరోజు అతడు అమెరికా నుంచి భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది. తాజా అప్‌డేట్ ఏమిటంటే.. రాణాను ఢిల్లీలోని తిహార్ జైలులో ఉంచే అవకాశం ఉంది. ఇందుకోసం తిహార్ జైలులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారట. అవసరమైతే జైలు నుంచే అతడిని కోర్టు ఎదుట హాజరుపరుస్తారని సమాచారం. ఇప్పటికే ఎంతో కరుడుగట్టిన ఉగ్రవాదులు తిహార్ జైలులో ఉన్నారు. ఇప్పుడు రాణా కూడా ఆ జాబితాలో చేరబోతున్నాడు.ఇక ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. మూడు సంవత్సరాల కాలానికి లేకపోతే ట్రయల్ పూర్తయ్యేవరకు ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానాలు, అప్పిలేట్ కోర్టుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తరఫున ఆయన వాదనలు వినిపించనున్నారు. ఏది ముందుగా పూర్తయితే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మరోవైపు అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ వెబ్‌సైట్‌లో కీలక సమాచారాన్ని పొందుపరిచారు. ఏప్రిల్ 8 నుంచి తహవ్వుర్ రాణా తమ అదుపులో లేడని అందులో ప్రస్తావించారు. దీన్నిబట్టి అతడిని అమెరికా నుంచి భారత్‌కు విమానంలో బయలుదేరారని క్లారిటీ వచ్చింది.
Also Read :Rs 5000 Fine: నల్లాకు మోటర్ బిగిస్తే రూ.5 వేలు జరిమానా..!
మోడీ సర్కారు దౌత్య విజయం : అమిత్‌షా
26/11 ఉగ్రవాద దాడుల నిందితుడైన తహవ్వుర్ రాణాను అప్పగించడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ దౌత్యానికి “పెద్ద విజయం” అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. “బాంబు పేలుళ్లు జరిగిన సమయంలో ఉన్న ప్రభుత్వాలు రాణాను భారత్‌కు తీసుకు రాలేకపోయాయి” అంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ను ఆయన విమర్శించారు.
Also Read :Nightclub Collapse: డొమినికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం..113 మంది మృతి, ఎక్కువ మంది సెలబ్రిటిలే!
ముంబై ఉగ్రదాడి గురించి..
ముంబై(Tahawwur Rana) ఉగ్రదాడి దాదాపు 60 గంటల పాటు కొనసాగింది. ఇందులో 9 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు పాల్గొన్నారు. వారు జరిపిన దాడిలో 166 మంది అమాయకులు చనిపోయారు. అరేబియా సముద్ర మార్గాన్ని ఉపయోగించి ముంబైలోకి చొరబడిన ఉగ్రవాదులు ముంబై సీఎస్‌టీ రైల్వే స్టేషన్, రెండు లగ్జరీ హోటళ్ళు, ఒక యూదు కేంద్రంపై ఏకకాలంలో దాడి చేశారు. ఈ ఘటన ఆనాడు యావత్ దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చివరకు ఈ ఘటనతో పాకిస్తాన్‌పై దాడి చేయాలనే ఆలోచనకు భారత్ వచ్చింది. అయితే భారత సర్కారు భవిష్యత్తు పరిణామాల గురించి ఆలోచించి యుద్ధ ప్రతిపాదనను విరమించుకుంది. ముంబై ఉగ్రవాద దాడుల ప్రధాన కుట్రదారులలో ఒకరైన డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీకి సన్నిహితుడే ఈ తహవ్వుర్ రాణా. రాణాను విచారించి నిజాలు కక్కించేందుకు, పాకిస్తాన్ పాత్రను బయటపెట్టేందుకు భారత దర్యాప్తు సంస్థలు రెడీ అవుతున్నాయి.