Mumbai Airport : ముంబయి ఎయిర్‌పోర్టు కస్టమ్స్ నుంచి భారీగా అధికారుల బ‌దిలీ.. కార‌ణం ఇదే..?

ముంబై ఎయిర్‌పోర్ట్ క‌స్ట‌మ్స్ విభాగంలో భారీగా అధికారులు బ‌దిలీ అయ్యారు. 34 మంది అధికారులు, నలుగురు సిబ్బందిని బదిలీ

  • Written By:
  • Publish Date - March 3, 2023 / 07:32 AM IST

ముంబై ఎయిర్‌పోర్ట్ క‌స్ట‌మ్స్ విభాగంలో భారీగా అధికారులు బ‌దిలీ అయ్యారు. 34 మంది అధికారులు, నలుగురు సిబ్బందిని బదిలీ చేస్తూ ముంబై విమానాశ్రయానికి చెందిన కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లంచం సమస్యను పరిష్కరించడానికి.. ఈ బదిలీలు చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం. Paytm వ్యాలెట్ ద్వారా లంచాలు స్వీకరించడంలో కొంతమంది అధికారులు ప్రమేయం ఉన్నట్లు ఉన్న‌తాధికారులు గుర్తించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఫిబ్రవరి 11 న కస్టమ్స్ సూపరింటెండెంట్ అలోక్ కుమార్‌ను అరెస్టు చేసింది. రూ. 1.5 లక్షల విలువైన బంగారు గొలుసుతో వచ్చిన ప్రయాణీకుడి నుండి రూ. 30,000 లంచం తీసుకున్న ఆరోపణలపై అయ‌న్ని అరెస్ట్ చేసింది. అలోక్ కుమార్ ప్రయాణికుడిని బెదిరించి పేమెంట్ వాలెట్ ద్వారా చెల్లించమని బలవంతం చేశాడు. అదే రోజు అంటే ఫిబ్రవరి 11న మరో కస్టమ్స్ సూపరింటెండెంట్ శ్యామ్ సుందర్ గుప్తా ఓ ప్రయాణికుడిని బెద‌రించి లంచం డిమాండ్ చేశాడు.

మరో కేసులో ఐఫోన్ 14 ప్రో-మాక్స్, ఆభరణాలతో గల్ఫ్ దేశానికి చెందిన ఓ మహిళా ప్రయాణికుడిని కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ రింకు సంగ అడ్డుకున్నాడు. డిజిటల్ వాలెట్‌లో రూ. 5,000 లంచంగా ఇవ్వాలని మహిళ బలవంతం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రెండు కేసుల్లో కస్టమ్స్ హవాల్దార్ సంతోష్ వాడేకర్ ప్రమేయం ఉందని, సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును నమోదు చేసింది. రెండు ఎయిర్‌పోర్టు లోడర్ల వాలెట్ ఖాతాల విశ్లేషణలో వివిధ వ్యక్తుల నుంచి ఏడాదిలో రూ.47 లక్షలు బ్యాలెన్స్ ఉన్నట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్ వెల్లడించింది. ఇది లంచం ద్వారా సేకరించిన డబ్బుగా దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఇదిలా ఉండగా, బదిలీ అయిన అధికారులు మరియు సిబ్బంది తమ సంబంధిత క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.