Supreme Court : మధ్యప్రదేశ్‌లో రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన మంత్రి కున్వర్ విజయ్ షా వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న విజయ్ షా, తన మంత్రి పదవిని కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ సుప్రీంకోర్టులో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జూలై 28న దాన్ని కొట్టివేయడంతో విజయ్ షాకు పెద్ద ఉపశమనం లభించింది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ను భారత ప్రభుత్వం చేపట్టింది. కల్నల్ సోఫియా ఖురేషి నేతృత్వంలో సైన్యం ఉగ్రవాదులపై ఆపరేషన్ నిర్వహించింది. కల్నల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ విజయాలను మీడియాకు నిరంతరం తెలియజేస్తూ ప్రజాదరణ పొందారు.
అయితే, మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా ఓ సభలో కల్నల్ ఖురేషిపై “మన ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచిన ఉగ్రవాదులను అంతం చేయడానికి అదే మతానికి చెందిన కల్నల్ సోఫియాను పాకిస్థాన్‌పైకి పంపారు” అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర వ్యతిరేకత చెలరేగింది.
విపక్షాలు విజయ్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విమర్శల దుమారంలో విజయ్ షా బహిరంగంగా క్షమాపణలు చెప్పినా, కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించడం వల్ల విజయ్ షాకు పెద్ద ఊరట లభించింది.
పహల్గామ్‌లో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. సోమవారం ఉదయం ‘ఆపరేషన్ మహాదేవ్’లో భారత సైన్యం శ్రీనగర్ సమీపంలో మూడు ఉగ్రవాదులను హతమార్చింది. వీరిలో కీలక సూత్రధారి సులేమాన్ మూసా కూడా ఉన్నట్లు సమాచారం. సంచార జాతుల ద్వారా వచ్చిన పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ విజయవంతమైంది.
Auto Tips : మీరు మీ వాహనాన్ని ఫుల్ ట్యాంక్ పెట్రోల్‌తో నింపుతారా.? దీన్ని గుర్తుంచుకోండి..!