Omicran New Variant : దేశరాజధానిలో కొత్త వేరియంట్ కలవరం…వేగంగా వ్యాపిస్తోందన్న వైద్యులు..!!

దేశ రాజధాని హస్తినాలో కోవిడ్ ప్రధాన వేరియంట్ ఒమిక్రాన్ లో కొత్త సబ్ వేరియంట్ కలకలం రేపుతోంది. దీనిని ఓమిక్రాన్ BA 2.75 గా పిలుస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 10, 2022 / 08:03 PM IST

దేశ రాజధాని హస్తినాలో కోవిడ్ ప్రధాన వేరియంట్ ఒమిక్రాన్ లో కొత్త సబ్ వేరియంట్ కలకలం రేపుతోంది. దీనిని ఓమిక్రాన్ BA 2.75 గా పిలుస్తున్నారు. ఈ మధ్యే ఢిల్లీలో కోవిడ్ కేసుల సంఖ్య, పాజిటివిటి రేటు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అధికారులు పెద్దెత్తున శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించి పరిశీలించారు. ఈ క్రమంలో చాలా శాంపిళ్లలో కొత్త సబ్ వేరియంట్ ఉన్నట్లుగా బయటపడిందని ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.

ఢిల్లీలో ఓమిక్రాన్ ఉపవేరియంట్ BA2.75 వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు నివేదికల్లో తేలింది. మిగతా వేరియంట్లతో పోల్చితే ఇది మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల 90శాతం శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా…కొత్త వేరియంట్ విషయం బయటపడింది. ఇప్పటికే వ్యాక్సిన్లు తీసుకుని శరీరంలో యాంటీబాడీలు ఉన్న వారికి కూడా ఈ కొత్త వేరియంట్ సోకుతోందని తేలిందని డాక్టర్ సురేశ్ కుమార్ వెల్లడించారు.

ఈ కొత్త వేరియంట్ శరీరంలో రోగనిరోధక శక్తిని తప్పించుకుని సోకుతుందని..వేగంగా ఇతరులకు వ్యాపిస్తుందని పేర్కొన్నారు. అయితే కొత్త వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు మరీ ప్రమాదకరంగా ఏం లేనట్లు చెప్పారు. కానీ 60ఏళ్లు దాటినవారు, షుగర్, గుండె, ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడుతున్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.