జాతీయ ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టూడే దేశ వ్యాప్తంగా పబ్లిక్ పల్స్ తెలుసుకొనే ప్రయత్నం చేసింది. తాజాగా నిర్వహించిన సర్వే వివరాలను వెల్లడించింది. ఇండియా టూ డే – సీ ఓటర్ తో కలిసి నిర్వహించిన ఈ సర్వేలో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కర ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వైసీపీ పైన వ్యతిరేకత ఉందని ప్రచారం సాగుతున్న వేళ ఇండియా టూడే సర్వేలో ఏపీ ప్రజలు మరోసారి వైసీపీకే పట్టం కడుతున్నట్లు స్పష్టం అయింది.
వైసీపీకి 18 లోక్ సభ స్థానాలు వస్తాయని, టీడీపీకి ఏడు స్థానాలు దక్కుతాయని సర్వేలో తేలింది. దీని ద్వారా ప్రస్తుతం వైసీపీకి ఉన్న 22 స్థానాల్లో నాలుగు వరకు తగ్గే అవకాశం ఉంది. టీడీపీకి మూడు స్థానాలు ఉండగా, వైసీపీ నుంచి నాలుగు స్థానాలు తమ ఖాతాలో వేసుకుంటున్నట్లుగా సర్వే లెక్కలు చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వెల్లడైన ఇండియా టీవీ సర్వేలోనూ ఏపీలో వైసీపీకి 19 లోక్ సభ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇప్పుడు 18 లోక్ సభ స్థానాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పటం ద్వారా, 127 అసెంబ్లీ స్థానాల్లో వైసీపికి సానుకూలత ఉందని సర్వే అంచనాకు వచ్చింది. ఇక, తెలంగాణలో టీఆర్ఎస్ – బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా తల పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో లోక్ సభ స్థానాల్లో బీజేపీ గణనీయంగా పుంజుకుంది. ఇండియా టూడే సర్వే ప్రకారం బీజేపీ ప్రస్తుతం ఉన్న నాలుగు సీట్ల సంఖ్యను 6 కు పెంచుకొనే అవకాశం ఉంది. ఇక, టీఆర్ఎస్ 8 స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వే తేల్చింది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది.
జాతీయ స్థాయిలో మరోసారి ప్రజలు ప్రధాని మోదీకి మద్దతుగా నిలిచారు. అయితే, సీట్లు మాత్రం గతం కంటే తగ్గుతాయని సర్వే తేల్చింది. 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలివగా, ఈ సారి 286 వస్తాయని అంచనాకు వచ్చింది. అదే విధంగా కాంగ్రెస్ సొంతంగా గతం కంటే సీట్ల సంఖ్య పెంచుకుంటున్నట్లుగా సర్వే లో తేలింది. 2019లో కాంగ్రెస్ సొంతంగా 52 సీట్లు దక్కించుకోగా, 2024 ఎన్నికల్లో ఆ సంఖ్య 146 కు చేరే అవకాశం ఉందని సర్వే లో స్పష్టం అయింది. ఇతరులు 111 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది. అదే విధంగా ప్రధానిగా మోదీనే కొనసాగాలంటూ సర్వేలో 54 శాతం మద్దతు లభించింది. ప్రధానిగా రాహుల్ గాంధీకి మద్దతుగా 9 శాతం మందే నిలిచారు.
ఏపీలో జగన్ వైపే మెజార్టీ ప్రజలు ఉన్నారని అంచనా వేసింది.ఎన్డీఏ నుంచి మిత్రపక్షాలు దూరం అవుతున్న వేళ కూడా ప్రజలు మోదీ నాయకత్వానికే మద్దతుగా నిలుస్తున్నట్లు సర్వే లో తేలింది.