Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్ భవనానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మీడియాతో మాట్లాడుతూ.. ఈ వర్షాకాల సమావేశాలు దేశ ప్రగతికి తోడ్పడేలా ఫలప్రదంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మోడీ భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రను ప్రస్తావిస్తూ, అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకం ఎగరడం దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచిందన్నారు. ఇది ఎంతోమందికి ప్రేరణగా మారుతుందని తెలిపారు. అంతరిక్ష యాత్ర ద్వారా యువతకు నూతన శక్తి, కొత్త ఆశలేర్పడతాయన్నారు. అంతేకాకుండా, ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం అత్యున్నత సామర్థ్యాన్ని చూపింది. కేవలం 22 నిమిషాల్లో లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించి, ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది.
Read Also: Shocking : జస్ట్ మిస్.. ప్రయాణికుల విమానాన్ని ఢీకొట్టబోయిన యుద్ధ విమానం
ఇది మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘట్టం అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి చోట మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలపై చర్చ జరుగుతోంది. మన దేశ రక్షణ రంగంలో జరిగిన మార్పులు, అభివృద్ధి, స్వదేశీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పై ఆసక్తి పెరుగుతోంది. దేశాభివృద్ధిలో భాగస్వామ్యంగా దేశ ప్రజలంతా కలిసి నడవాల్సిన సమయం ఇది అని పిలుపునిచ్చారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఉగ్రవాదం, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రచారం చేయడానికి మన ఎంపీలు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి వివరణ ఇచ్చారని మోడీ గుర్తుచేశారు. పాకిస్థాన్ దుష్టచర్యలను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టడం జరిగింది. తుపాకులు, బాంబుల ముందు మన రాజ్యాంగం నిలబడగలిగింది. ఇది భారత ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం అని అన్నారు.
ఈ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని జాతీయంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమై, ఆగస్టు 21 వరకు మొత్తం 21 రోజులపాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్‌తో పాటు ఇతర జాతీయ ప్రాధాన్య అంశాలపై విపక్షాలు చర్చకు సిద్ధమయ్యాయి. ప్రధాని ఈ అంశాలపై ప్రత్యక్షంగా స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ..పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలకు అనుగుణంగా అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం మంచి వర్షాలు కురుస్తున్నాయని, ఇది రైతులకు చాలా లాభదాయకమని ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. రైతుల జీవితం, దేశ ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. దేశ భవిష్యత్తు కోసం వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ వర్షాకాల సమావేశాలు దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా, అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Cesarean Deliveries : సిజేరియన్లలో తెలంగాణే టాప్