Site icon HashtagU Telugu

Ind vs Pak Match: జవాన్ల రక్తం కంటే బీసీసీఐకి డ‌బ్బే ముఖ్యం.. ఎంపీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

Ind vs Pak Match

Ind vs Pak Match

Ind vs Pak Match: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌తో (Ind vs Pak Match) దౌత్య సంబంధాలను నిలిపివేసింది. సింధూ జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది. ఈ కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఆసియా కప్ 2025లో భారత్- పాకిస్తాన్ క్రికెట్ జట్లు సెప్టెంబర్ 14న దుబాయ్‌లో తలపడనున్నాయి. ఈ నిర్ణయంపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శలు

శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై కేంద్ర ప్రభుత్వం, భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ.. “మన సహ భారతీయుల, జవాన్ల రక్తం కంటే బీసీసీఐకి డబ్బు ముఖ్యం” అని ఆరోపించారు. ఆమె ఈ డబ్బును ‘బ్లడ్ మనీ’ అని అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రభుత్వం ప్రదర్శించిన హిపోక్రసీని ఆమె తీవ్రంగా విమర్శించారు. బీసీసీఐ సంపాదించాలనుకుంటున్నది కేవలం బ్లడ్ మనీ మాత్రమే కాదని, అది శాపగ్రస్తమైన డబ్బు కూడా అని అన్నారు.

Also Read: Shocking : మూఢనమ్మకాలకు బలైన గృహిణి.. “దేవుడి దగ్గరికి వెళ్తున్నా” అంటూ

ఆసియా కప్ షెడ్యూల్, WCL వివాదం

ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఆసియా కప్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ వివాదం మరింత పెరిగింది. సెప్టెంబర్ 14న జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను ‘బ్లాక్‌బస్టర్ మ్యాచ్’గా ఏసీసీ పేర్కొంది. ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది.

ఇటీవ‌ల వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు మాజీ భారత క్రికెటర్లకు అనుమతి ఇవ్వడంపై కూడా ప్రియాంక చతుర్వేది బీసీసీఐని విమర్శించారు. అప్పుడు కూడా ఆమె పహల్గామ్ దాడిని ప్రస్తావించారు. ఆ తర్వాత భారత ఆటగాళ్లు నిరాకరించడంతో ఆ మ్యాచ్ రద్దయింది.

అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నలు

AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ వివాదంపై గళం విప్పారు. లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ ‘రక్తం- నీరు కలిసి ప్రవహించవు’ అనే ప్రకటనను ఉటంకిస్తూ ఒకవైపు ఉగ్రవాదంతో సంభాషణలు ఉండవని చెప్తూనే, మరోవైపు పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌ ఎలా ఆడవచ్చని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పహల్గామ్ బాధితులకు ఆపరేషన్ సిందూర్ చేశామని చెప్పి, ఇప్పుడు మ్యాచ్ చూడండి అని ప్రభుత్వం చెప్పగలదా అని ఒవైసీ ప్రశ్నించారు.