Site icon HashtagU Telugu

Mohana Singh : మోహనాసింగ్ రికార్డ్ .. తేజస్ యుద్ధ విమానం నడిపిన తొలి మహిళా పైలట్‌

Mohana Singh First Woman Fighter Pilot

Mohana Singh : స్క్వాడ్రన్ లీడర్ మోహనా సింగ్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు.  భారత వాయుసేనకు  చెందిన స్వదేశీ యుద్ధ విమానాలు ఎల్‌సీఏ తేజస్‌ను నడిపే  ‘ఎలైట్ 18 ఫ్లయింగ్ బుల్లెట్స్’ స్క్వాడ్రన్‌లో ఆమె చోటు దక్కించు కున్నారు. దీంతో ఆ స్క్వాడ్రన్‌లో అవకాశం పొందిన తొలి మహిళగా ఆమె చరిత్రను క్రియేట్ చేశారు. ఇటీవలే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించిన తరంగ్ శక్తి సైనిక విన్యాసాల్లో తేజస్ యుద్ద విమానాన్ని ఆమె నడిపి సత్తా చాటుకున్నారు. ఈ విన్యాసాలను భారత త్రివిధ దళాలకు చెందిన ముగ్గురు వైస్ చీఫ్‌లు స్వయంగా తిలకించారు.  గతంలోకి వెళితే 2016 సంవత్సరంలో మోహనాసింగ్‌తో పాటు భవనా కాంత్, అవనీ చతుర్వేదిలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి ఫైటర్ పైలట్లుగా రిక్రూట్ చేసుకున్నారు.

Also Read :Israel Vs Lebanon : పేలిన పేజర్లు.. 9 మంది మృతి.. 2,750 మందికి గాయాలు

చివరిసారిగా 1991 సంవత్సరంలో మహిళా పైలట్లను హెలికాప్టర్లు నడపడానికి, ట్రాన్స్ పోర్టు విమానాలు నడపడానికి వాయుసేన అనుమతించింది. 2016లో తొలిసారిగా వారికి ఫైటర్ పైలట్లుగా అవకాశం ఇచ్చారు. స్క్వాడ్రన్ లీడర్ భవనా కాంత్, స్క్వాడ్రన్ లీడర్ అవనీ చతుర్వేది ప్రస్తుతం సుఖోయ్-30 యుద్ధ విమానాలను నడుపుతున్నారు. ఇంతకుముందు వరకు మోహనా సింగ్ గుజరాత్ సరిహద్దు ఏరియాల్లో మిగ్-21 యుద్ధ విమానాలను నడిపేవారు. కాగా, మోహనా సింగ్(Mohana Singh) రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లా వాస్తవ్యురాలు. ఆమె తాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోని ఏవియేషన్ రీసెర్చ్ సెంటరులో ఫ్లయిట్ గన్నర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.

జోధ్‌పూర్‌లో జరిగిన సైనిక విన్యాసాల సందర్భంగా ఆర్మీ, నేవీకి చెందిన వైస్ చీఫ్‌లు లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి, వైస్ అడ్మిరల్ క్రిష్ణా స్వామినాథన్‌లు కూడా పైలట్లతో కలిసి తేజస్ యుద్ధ విమానాల్లో విహరించారు. ఇక ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తాను స్వయంగా తేజస్ యుద్ధ విమానాన్ని నడిపారు. మొత్తం మీద ఈ విన్యాసాల ద్వారా మేకిన్ ఇండియా ద్వారా తయారైన భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసొచ్చింది. తేజస్ యుద్ధ విమానాల సత్తాను అందరూ కళ్లారా చూశారు.