Mohamed Muizzu: భారతదేశం- మాల్దీవుల మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా ఉద్రిక్తమైన కాలంలో ఉన్నాయి. మాల్దీవుల చైనా అనుకూల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ (Mohamed Muizzu) అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలలో కొత్త దశ మొదలైంది. కాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. వ్యూహాత్మక దృక్కోణం నుండి ఈ ద్వీప దేశం దాని భౌగోళిక స్థానం కారణంగా భారతదేశానికి ముఖ్యమైనది.
రెండు దేశాల మధ్య అనేక ముఖ్యమైన అంశాలపై ఏకాభిప్రాయం
మహ్మద్ ముయిజ్జూ భారత పర్యటన సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 6 నుంచి 10 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముయిజ్జూ- ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా అధికారికంగా సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో ముయిజ్జూ దేశ వాణిజ్య రాజధాని ముంబై, ఐటీ హబ్ బెంగళూరును కూడా సందర్శిస్తారు. ఈ రెండు నగరాల్లోనూ కొన్ని వ్యాపార కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
Also Read: Google Badges : గూగుల్‌లోనూ వెరిఫికేషన్ బ్యాడ్జీలు.. ఫేక్ అకౌంట్స్‌కు చెక్
ముయిజ్జు ఇండియాకు వ్యతిరేకంగా నినాదాన్ని ఇచ్చాడు
ముయిజ్జు, అతని పార్టీ భారతదేశాన్ని వ్యతిరేకించడం కొత్త విషయం కాదు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఆయన ఇండియా అవుట్ అనే నినాదాన్ని ఇచ్చారు. ముయిజ్జు చైనా వైపు మొగ్గు చూపారు. అతను అధికారం చేపట్టినప్పటి నుండ చైనా మాల్దీవులలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ వ్యూహాత్మకంగా ముఖ్యమైన ద్వీప దేశానికి బీజింగ్ కూడా పెద్ద రుణాన్ని ఇస్తోంది. అయితే గత కొన్ని నెలలుగా అతని ప్రకటనలలో మితవాద సంకేతాలు కనిపించడం ప్రారంభించాయి.
ఇటీవల అమెరికాలోని ఓ యూనివర్శిటీలో ప్రసంగిస్తూ నేనెప్పుడూ భారత్ వ్యతిరేక ప్రకటనలు చేయలేదని అన్నారు. మాల్దీవులకు భారతదేశం చారిత్రాత్మకంగా ముఖ్యమైన భాగస్వామి అని ఆయన అభివర్ణించారు. పర్యాటకం, రక్షణ సహా కొన్ని ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరగవచ్చని భావిస్తున్నారు.