Metro Yellow Line : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం బెంగళూరులో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బెంగళూరు – బెళగావి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆయన స్వయంగా ప్రారంభించారు. అదే వేదిక నుండి వర్చువల్ మాధ్యమంగా అమృత్‌సర్ – కాట్రా, నాగ్‌పుర్ – పుణె వందే భారత్ రైళ్లకు జెండా ఊపారు. ప్రధాని మోడీ, కొత్తగా ప్రారంభించిన బెంగళూరు-బెళగావి వందే భారత్ రైల్లో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. టెక్నాలజీ, అభివృద్ధి, యువత భవిష్యత్తుపై చర్చిస్తూ వారిని ప్రోత్సహించారు. విద్యార్థుల స్ఫూర్తిదాయక ప్రశ్నలకు మోడీ సమాధానాలు ఇచ్చారు.
Read Also: Tollywood : మా సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారు
అంతేకాకుండా, బెంగళూరు నగర అభివృద్ధిలో భాగంగా మెట్రో రైలు ప్రాజెక్టులో కీలకమైన ఎల్లో లైన్ (ఆర్‌వీరోడ్ – బొమ్మసంద్ర, 19.15 కి.మీ) మార్గాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు హాజరయ్యారు. మెట్రో ప్రారంభోత్సవ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే, ఈ కార్యక్రమాల మధ్య రాజకీయం కూడా వేడెక్కింది. ముఖ్యంగా నమ్మా మెట్రో ఎల్లో లైన్ ప్రారంభంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ..ఈ మెట్రో ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వమే ఎన్నో అడ్డంకులను దాటి ముందుకు తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు భాజపా ఈ ప్రాజెక్టుకు తమ పేరు పూసుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆలస్యం అయింది.అని ఆరోపించారు. ఇది మేమే రూపొందించిన అర్బన్ మొబిలిటీ ప్రణాళికలో భాగం. అప్పట్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి ప్రారంభించింది. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు తగ్గింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగింది. చివరికి రుణాలు తీసుకొని ప్రాజెక్టును పూర్తి చేయాల్సి వచ్చింది అంటూ ఖర్గే అసహనం వ్యక్తం చేశారు.
ఇక, ఓట్లు మాత్రమే కాదు… ఇప్పుడు క్రెడిట్ కూడా బీజేపీ దొంగిలిస్తోంది అంటూ ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక ప్రజల మధ్య ఈ అంశంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేస్తూనే, ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విషయంలో పారదర్శకత అవసరం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీలు అభివృద్ధిని ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకోవద్దని, సహకారంతో పనిచేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ బీజేపీ ప్రచారాన్ని బలోపేతం చేయడం, కాంగ్రెస్ తమ క్రెడిట్ కాపాడుకోవడం మధ్య రాజకీయం మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే దీన్ని పక్కనబెడితే, ప్రజలకు మెట్రో, వందే భారత్ వంటి తక్షణ ప్రయోజనాలు కలుగుతున్నవన్నదే ఒక హృదయపూర్వక నిజం.
Read Also: BJP : బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు