దేశ రాజధాని ఢిల్లీలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (79th Independence Celebrations) ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) ఎర్రకోటపై వరుసగా 12వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి, అమరవీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు సహా వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ రోజు 140 కోట్ల మంది భారతీయులు పండుగ చేసుకునే రోజు అని, ఇది దేశం సమైక్య భావనతో ఉప్పొంగే సమయమని అన్నారు. కోట్లాది మంది త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, దేశ ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.
పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ హెచ్చరిక
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ‘న్యూక్లియర్’ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, “ఇలాంటి బెదిరింపులకు భారత్ భయపడదు” అని అన్నారు. “న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్ గతంలో నడిచింది కానీ ఇప్పుడు నడవదు. ఉగ్రవాదులు, వారిని పోషించేవారిని భారత్ వేర్వేరుగా చూడదు. వారంతా మానవత్వానికే ప్రమాదకరం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత్ తన భద్రతా విధానంలో ఎంత పట్టుదలతో ఉందో స్పష్టం చేస్తున్నాయి.
‘ఆపరేషన్ సిందూర్’ వీర జవాన్లకు ప్రధాని సెల్యూట్
పహల్గామ్‌లో ఉగ్రవాదులు మతం పేరుతో సృష్టించిన నరమేధానికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రధాని మోదీ ప్రశంసించారు. “మన సైన్యం ఆపరేషన్ సిందూర్‌తో వారికి దీటైన సమాధానం ఇచ్చింది. పాక్‌లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. సింధూ నదిపై భారత్‌కు పూర్తి హక్కులున్నాయి. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవు” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌లో పాల్గొన్న వీర జవాన్లకు ఆయన సెల్యూట్ చేశారు. అలాగే, ఇటీవల దేశంలో సంభవించిన ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ యోజన’ ప్రకటన
ప్రధాని మోదీ తన ప్రసంగంలో ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ యోజన’ అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద యువత కోసం రూ. లక్ష కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా, తొలిసారిగా ఉద్యోగం పొందిన యువతకు రూ.15 వేల ప్రోత్సాహం అందిస్తామని, ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు కూడా కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : Pulivendula Results : ప్రజాస్వామ్యం గెలిచింది – అచ్చెన్నాయుడు