Site icon HashtagU Telugu

Independence Day 2023 : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదే – మోడీ

Independence Day 2023

Modi to hoist tricolour for the 10th time at Red Fort

దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర వేడుకులు (Independence Day) అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట (Errakota)లో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు. వరుసగా పదోసారి ప్రధానిగా మోడీ ఎర్రకోట నుంచి జెండా ఎగురువేయగా… దీంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రికార్డు సమం అయ్యింది. ప్రధాని జెండా ఆవిష్కరణకు ముందు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ చేరుకొని జాతిపిత మహాత్మాగాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటపై బయలుదేరారు.

జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోడీ (PM Modi) మాట్లాడారు. ‘నా కుటుంబంలోని 140 కోట్ల మంది సభ్యులు ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.. వారికి నా శుభాకాంక్షలు.. భారత స్వాతంత్య్ర పోరాటంలో తమ వంతు సహకారం అందించిన మహాత్ములకు నా నివాళులు అర్పిస్తున్నాను’ అని అన్నారు. బాపూజీ చూపించిన అహింసా మార్గంలోనే స్వాతంత్య్రం సాధించామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదేనని , దేశం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని వెల్లడించారు. అమరవీరుల త్యాగఫలితమే స్వాతంత్ర్యం అని మోడీ అన్నారు. తమ పాలనలో.. రైతుల కోసం కిసాన్‌ సమ్మాన్‌ నిధి అమలు చేస్తున్నామని.. ఎరువులను సబ్సిడీపై అందిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వందే భారత్‌ ట్రైన్స్‌ తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.

ఇటీవల మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనల ఫై కూడా మోడీ స్పందించారు. త్వరలోనే అక్కడ శాంతి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. మణిపూర్ ప్రజలకు దేశం అండగా ఉంది. ప్రజలు ఈ శాంతి సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. శాంతి ద్వారానే దేశం వృద్ధి చెందుతుంది. శాంతిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయని, భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగుతాయన్నారు. దేశంలోని యువతకు లభించినంత సౌలభ్యం మరెవరికీ దక్కడం లేదన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలం సాంకేతిక పరిజ్ఞానంతో మరింత ప్రభావితమవుతుందని.. జనాభా, విస్తీర్ణం పరంగా కొన్ని నగరాలు, పట్టణాలు చిన్నవే కావచ్చని కానీ అక్కడ ప్రజల సామర్థ్యం దేనికీ తీసిపోదన్నారు.

2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం 10వ స్థానంలో ఉంటె.. ఈ రోజు 5వ స్థానానికి చేరుకున్నాం. అప్పుడు అవినీతి దేశాన్ని పట్టిపీడించింది. 10 సంవత్సరాల లెక్కలను దేశ ప్రజల ముందు ఉంచుతున్నాను. గతంలో పేదలకు ఇళ్లు నిర్మించేందుకు రూ.90 వేల కోట్లు ఖర్చు చేశారు. నేడు నాలుగు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం అన్నారు. గత ఐదున్నరేళ్లలో 5.13 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు మోడీ తెలిపారు. అలాగే వచ్చే నెలలో విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. విశ్వకర్మ పథకంలో రూ.15,70 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు.

ఇక ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకుల్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Read Also : 77th Independence Day: పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైన గోల్కొండ.. 11 గంటలకు సీఎం పతాకావిష్కరణ..!