Site icon HashtagU Telugu

Big breaking : మోడీ సంచలనం.. మూడు సాగు చట్టాలు రద్దు!

కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాగు చట్టాలపై అంతటా విమర్శలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలతో పాటు బీజేపీలోనూ కొంతమంది కీలక నేతలు సైతం సాగు చట్టాలను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రధాన నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తో పాటు ఉత్తర భారతంలో పలు రాష్ట్రాల్లో ఈ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ శివార్లలో పంజాబ్ రైతులు ఏడాదికి పైగా నిరవధికంగా ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు గురునానక్ జయంతి సందర్భంగా మోదీ కీలక ప్రకటన చేయడం గమనార్హం. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో మోదీ నుంచి ప్రకటన వెలువడటం గమనించాల్సిన విషయం. ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యవసాయ చట్టాలపై ప్రజలకు నచ్చచెప్పేందుకు ఎంతో ప్రయత్నించామని అన్నారు. ఈ చట్టాలను కొందరు సమర్థించగా, మరికొందరు వ్యతిరేకించారని తెలిపారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతుల నుంచి వ్యతిరేకత వచ్చిందని… వారి కోరిక మేరకు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను ఉపసంహరించుకుంటామని చెప్పారు. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు లభించేలా కృషిచేశామని పేర్కొన్నారు. 22 కోట్ల భూసార కార్డులను పంపిణికి చర్యలు చేపట్టామని, ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తామని వివరించారు. రైతులు ఆందోళనలను విరమించి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

Exit mobile version