ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం (PM Modi’s aircraft faces technical snag) ఏర్పడడం అందర్నీ ఖంగారుకు గురి చేసింది. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ, తిరిగి ఢిల్లీకి వచ్చే సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఈ ఘటన జార్ఖండ్ డియోఘర్ (Deoghar airport) లో చోటు చేసుకుంది. దీంతో ప్రధాని ఢిల్లీకి తిరిగి రావడం ఆలస్యం అయ్యింది. సాంకేతిక లోపాన్ని సరిచేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు విమానం అక్కడే నిలిపివేశారు.
స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI) ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.6 వేల కోట్లకు పైగా విలువైన గిరిజన సంక్షేమ పథకాలను ఆయన ప్రారంభించారు. గిరిజన ఐకాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని ‘జన్ జాతియా గౌరవ్ దివస్’ సందర్భంగా బీహార్ లోని జముయిలో ఆయన విగ్రహానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. జనజాతియా గౌరవ్ దివస్ వేడుకల్లో ప్రధాని మోదీ నృత్య కళాకారులతో కలిసి సంప్రదాయ ధోల్ ధరించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకుడు బిర్సా ముండా ప్రతిమను ఆయనకు అందజేశారు.
ఈ సందర్బంగా మోడీ.. రూ.6,640 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిర్సా ముండా స్మారక నాణెం, పోస్టల్ స్టాంపును ఆయన విడుదల చేశారు. ‘‘అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. పదేళ్ల క్రితం గిరిజన ప్రాంతాలు, గిరిజన కుటుంబాల అభివృద్ధికి బడ్జెట్ రూ.25 వేల కోట్లలోపే ఉంది. మా ప్రభుత్వం దానిని 5 రెట్లు పెంచి రూ.1.25 లక్షల కోట్లకు పెంచింది’ అని మోడీ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటె ఈరోజే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ హెలికాప్టర్‌లో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. దేవఘర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొడ్డా జిల్లాలో ఈరోజు ఉదయం రాహుల్ హెలికాప్టర్‌లో టెక్నికల్ సమస్య వచ్చింది. దీంతో ఆ హెలికాప్టర్ 45 నిమిషాల పాటు భూమిపైనే ఉండిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్ కోసం రాహుల్ గాంధీ ఎదురు చూశారు. ఇలా ఒకేరోజు అటు ప్రధాని మోడీ , ఇటు రాహుల్ ప్రయాణిస్తున్న గాలి విమానాల్లో సాంకేతిక సమస్య ఎదురవ్వడం ఇరు పార్టీల నేతలను , పార్టీ శ్రేణులను ఖంగారు పెట్టింది.
Read Also : Yamaha Comic Con : యమహా నుండి కామిక్ కాన్