PM Modi: ఉగ్రదాడిలో అసువులు భాసిన అమరవీరులకు మోడీ నివాళి

ఉగ్రదాడిలో అసువులు భాసిన అమరవీరులకు లోక్ సభ  ఘన నివాళులర్పించింది.

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 01:59 PM IST

PM Modi: ఇరవై రెండు సంవత్సరాల క్రితం పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో అసువులు భాసిన అమరవీరులకు లోక్ సభ  ఘన నివాళులర్పించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో భాగంగా ఈ రోజు సభ ప్రారంభం కాగానే…  స్పీకర్ ఓం బిర్లా 2001వ సంవత్సరం డిసెంబర్ 13న  జరిగిన దాడి గురించి సభ్యులకు వివరించారు.అనంతరం సభ్యులందరూ లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు. ఇరవై రెండు సంవత్సరాల క్రితం పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో అసువులు భాసిన అమరవీరులకు రాజ్యసభ ఘన నివాళులర్పించింది.

పార్లమెంటు శీతాకాల సమావేశాలలో భాగంగా ఈ రోజు సభ ప్రారంభం కాగానే… ఛైర్మన్ జగదీప్ ధన్కడ్, ఆనాడు జరిగిన సంఘటన గురించి సభ్యులకు వివరించారు. అనంతరం సభ్యులందరూ లేచి నిలబడి కొద్దిసేపు మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు. ఇరవై రెండు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున దిల్లీలోని పార్లమెంటు భవనంలో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో అప్పటి ప్రధానమంత్రితో సహా పార్లమెంటు సభ్యులు, పార్టీల అగ్రశ్రేణి నాయకత్వం అక్కడే ఉన్నారు. ఆ సమయంలో  పాకిస్తాన్ ప్రోత్సాహ  లష్కర్ ఏ తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు మారణాయుధాలతో పార్లమెంటు భవనంపై ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు పార్లమెంటు భవన భద్రతా సిబ్బంది వీరోచితంగా పోరాడారు.

ఆ నాటి ఘటనలో అమరులైన వీరులకు ఈ రోజు పార్లమెంటు భవనం వద్ద ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. 22 సంత్సరాల క్రితం పార్లమెంట్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 9 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఈ దాడులకు పాల్పడిన ఐదుగురు తీవ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చారు. ఆదాడిలో అమరులైన సైనికులకు దేశం యావత్తు నివాళులర్పిస్తోంది.