Site icon HashtagU Telugu

Modi vs INDIA : గోదీ మీడియా Vs ఇండియా

Modi Media Vs Congress Alliance INDIA

Modi Media Vs Congress Alliance

By: డా. ప్రసాదమూర్తి

Modi vs INDIA : శుక్రవారం ముంబైలో ముగిసిన విపక్ష పార్టీల ఇండియా (INDIA) కూటమి నానాటికీ బలపడుతున్న సంకేతాలను దేశం మొత్తానికి పంపించింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్షాల ప్రముఖ నేతలు అందరూ రెండు మాటలు స్పష్టం చేశారు. ఒకటి తమ కూటమి అంతర్గత సమస్యలను పరిష్కరించుకొని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో అంతా చేయి చేయి కలిపి ఒక్కటై ముందుకు నడవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నట్లు ప్రకటించడం. రెండు, దేశంలో అధికార బిజెపి రాను రాను నియంతృత్వ పోకడలకు పోతోందని తమ కూటమిని ఛిన్నాభిన్నం చేయడానికి సర్వశక్తులా అది ప్రయత్నిస్తోంని, దేశాన్ని బిజెపి నియంతృత్వ కబంధహస్తాల నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమని పేర్కొనడం. ప్రతిపక్ష నాయకులు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలలో ఈ రెండు విషయాలు చాలా స్పష్టంగా కనిపించాయి.

ప్రతిపక్ష పార్టీలు పాట్నా మొదలుకొని బెంగళూరు మీదుగా ముంబై దాకా సాగించిన మూడు సమావేశాల్లో నిరంతరం తమలో ఐక్యత దృఢపడుతోందని నిరూపించాయి. అయితే ఈ పార్టీల మధ్య సయోధ్య ఎలా కుదురుతుందని, ఒకరితో ఒకరికి ఏ విషయంలోనూ పడదని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీతో ఆయా ప్రాంతీయ పార్టీల ఐక్యత ఎలా సాధ్యపడుతుందని, వీరు ఒక కూటమిగా (INDIA) ఏర్పడకముందే ముక్కలైపోతారని ప్రధాన స్రవంతి మీడియా ప్రచారం సాగిస్తూనే ఉంది. ఈ విషయం మీద ముంబై సమావేశంలో పాల్గొన్న ప్రతిపక్ష నేతలు అందరూ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు.

మీడియా దాదాపు మోడీ కను సన్నల్లో మెలగుతోందని, అది గోదీ మీడియా అని, మెయిన్ స్క్రీన్ మీడియా బానిసగా మారిపోయిందని, స్వేచ్ఛ కోల్పోయిందని, మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా విపరీత ప్రచారం.. ప్రతిపక్షాలకు ప్రతికూలంగా మరింత విష ప్రచారం.. ఇదే గోదీ మీడియా ప్రధాన లక్ష్యమని ముంబై విచ్చేసిన ప్రతిపక్ష నాయకులంతా మీడియా మీద విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ, నితీష్ కుమార్, మల్లిఖార్జున ఖర్గే, కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ తదితర దిగ్గజ నేతలు తమ ప్రసంగాల్లో కూటమి (INDIA) ఐక్యత గురించి స్పష్టమైన సంకేతాలు ఇస్తూనే, స్వతంత్ర భారతంలో మీడియా ఎంతో అశ్వతంత్రంగా దిక్కులేక విలవిల్లాడుతుందని, మీడియాని ఈ బానిస సంకెళ్ళ నుంచి విముక్తి చేయడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టంగా చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఐక్యమవుతున్న అంశాల మీద దృష్టి పెట్టకుండా, పంజాబ్ ఢిల్లీ, బెంగాల్, బీహార్, యూపీ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో ఇతర ప్రతిపక్ష పార్టీల పొత్తు ఎలా సాధ్యమవుతుందనే విషయం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి, మెయిన్ స్ట్రీమ్ మీడియా డిబేట్లు, విశ్లేషణలు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కథనాలు నడుపుతున్నది. ఇదే ప్రతిపక్ష నాయకులకు మీడియా పట్ల ఇంత వ్యతిరేక భావం నెలకొనడానికి కారణమైంది.

ముంబై సమావేశంలో ఐదు కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి మెయిన్ స్క్రీన్ మీడియాకు సంబంధించి, రెండు సోషల్ మీడియాకు సంబంధించి. ప్రతిపక్షాలు గోదీ మీడియాను ఎదుర్కోవడానికి ఎంత సాహసోపేత సంకల్పంతో ఉన్నాయో ఇది తెలియజేస్తుంది. ఒకపక్క ప్రతిపక్షాల ఐక్యత అసాధ్యమని ప్రచారం సాగిస్తున్న బిజెపి, దాని అనుచర మీడియా గణం, ఇప్పుడు పార్లమెంటు అత్యవసర సమావేశం మీద ప్రజల దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సమావేశం ఉద్దేశం ఏమిటో ప్రజలకంటే ప్రతిపక్షాలు ముందే ఊహిస్తున్నట్టు అర్థమవుతుంది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనే ఎజెండా ముందుకు తీసుకురావడంలో బిజెపి అంతర్దృష్టి ప్రతిపక్షాల ఐక్యతకు ఏమాత్రం సమయం ఇవ్వకూడదనేదే అని ప్రతిపక్షాలు పసిగట్టినట్టుగా తెలుస్తోంది. ‘ మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ. మేము రోజురోజుకూ బలపడుతున్నాం. మీడియాతో పాటు దేశాన్ని కూడా భయం నుంచి విముక్తి చేస్తాం’ అని ప్రతిపక్షాలు సమైక్యంగా సమర శంఖాన్ని పూరించాయి.

చూడాలి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు అత్యవసరంగా సమావేశం అవుతున్న సందర్భం ఎలాంటి వింత వార్తలు మోసుకొస్తుందో. అటు పాలకపక్షం ఇటు విపక్షం ఎంత సన్నద్ధంగా ఉన్నాయో.. అకస్మాత్తుగా ఎన్నికలు ఎదురైతే జయాపజయాలు, లాభనష్టాలు మొదలైన గణాంకాలు ఎలా ఉంటాయో.. అవన్నీ ఈ పార్లమెంటు అత్యవసర సమావేశం తర్వాత తేటతెల్లమవుతుంది.

Also Read:  AP CM Jagan Alternative Plan : ఆర్ 5 జోన్ విషయంలో జగన్ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి?