జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ నిర్వహించిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ దాడిలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడంపై ప్రతిపక్షాలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యవసరంగా సీసీఎస్ (కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ) సమావేశం నిర్వహించి పాకిస్తాన్‌పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Pahalgam Attack: గడ్డం కారణంగా ఉగ్రదాడి నుంచి బయటపడ్డ అస్సాం వ్యక్తి.. అసలేం జరిగిందంటే.?
ఈ నిర్ణయాల్లో భాగంగా భారత్‌లోకి పాకిస్తాన్ పౌరుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ సార్క్ వీసా మినహాయింపు స్కీమ్‌ను రద్దు చేశారు. ఇప్పటికే వీసా పొంది దేశంలో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా రెండు దేశాల మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేయడం పెద్ద పరిణామంగా మారింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేయకపోతే ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించబోమని కేంద్రం స్పష్టం చేసింది.
ఇక డిప్లమాటిక్ స్థాయిలో కూడా భారత్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌కు చెందిన రక్షణ, నేవీ, వైమానిక సలహాదారులను వారంలోపుగా వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించింది. అదే విధంగా ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హై కమిషన్ సలహాదారులను వెనక్కి రప్పించేందుకు చర్యలు ప్రారంభించింది. అట్టారీ చెక్‌పోస్ట్ మూసివేతతో పాటు, అక్కడి గుండా భారత్‌లోకి వచ్చిన వారు మే 1లోపు వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. ఈ చర్యలతో పాకిస్తాన్‌పై భారత్ బిగ్ షాక్ ఇచ్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలతో పాక్ కోలుకోవడం కష్టమే అని..ఇదే కాదు ముందు ముందు ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోని పాక్ ను అన్ని విధాలా దెబ్బతీయాలని దేశ ప్రజలంతా కోరుతున్నారు.