Pegasus spyware : దేశంలో `పెగాసిస్` దుమారం

భార‌త ప్ర‌భుత్వం గూఢచారి సాధ‌నం `స్పైవేర్ పెగాస‌స్` ను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింద‌ని న్యూయార్క్ టైమ్స్ ప్ర‌చురించిన క‌థ‌నం రాజ‌కీయ క‌ల్లోలాన్ని లేపుతోంది.

  • Written By:
  • Updated On - January 29, 2022 / 02:20 PM IST

భార‌త ప్ర‌భుత్వం గూఢచారి సాధ‌నం `స్పైవేర్ పెగాస‌స్` ను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింద‌ని న్యూయార్క్ టైమ్స్ ప్ర‌చురించిన క‌థ‌నం రాజ‌కీయ క‌ల్లోలాన్ని లేపుతోంది. దేశంలోని ప్ర‌ముఖులు, విప‌క్షాలు, జ‌డ్జిల ఫోన్ల‌ను టాపింగ్ చేయ‌డానికి 2017లో పెగాస‌స్ ను ఉప‌యోగించింద‌ని కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు. `ఇలాంటి గూఢ‌చ‌ర్యం దేశద్రోహం..మోడీ ప్ర‌భుత్వం దేశ‌ద్రోహానికి పాల్ప‌డింది..`అంటూ రాహుల్ ట్వీట్ చేశాడు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేస్తూ.. ‘మోదీ ప్రభుత్వం భారత్‌కు శత్రువుల్లా ప్రవర్తించి భారత పౌరులపై యుద్ధ ఆయుధాన్ని ఎందుకు ప్రయోగించింది? అంటూ నిల‌దీశాడు. “పెగాసస్‌ను ఉపయోగించి అక్రమంగా స్నూపింగ్ చేయడం దేశద్రోహానికి సమానం. చట్టానికి ఎవరూ అతీతులు కాదు, మేము న్యాయం జరిగేలా చూస్తాము” అని ఖ‌ర్గే ట్వీట్ చేశాడు.

మీడియా కథనాన్ని ఉటంకిస్తూ, కాంగ్రెస్ ప్రతినిధి షామా మహమ్మద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా భారత పౌరులపై స్నూప్ చేయడానికి బిజెపి ప్రభుత్వం మిలటరీ-గ్రేడ్ స్పైవేర్‌ను ఉపయోగించిందనడానికి ఇది “తిరుగులేని రుజువు” అని అన్నారు.న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నంలోని ప‌రిశోధ‌నాత్మ‌క అంశాలను ఆనాడు సుప్రీంకోర్టు, పార్లమెంటు దృష్టికి వెళ్ల‌కుండా ప్ర‌భుత్వం “తప్పుదోవ పట్టించింద‌ని రాజ్యసభ ఎంపీ , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శక్తిసిన్హ్ గోహిల్ ఆరోపించారు.ఇజ్రాయెల్‌తో ఒప్పందంలో భాగంగా భారత ప్రభుత్వం 2017లో పెగాసస్ గూఢచారి సాధనాన్ని కొనుగోలు చేసింది. ఆ విష‌యాన్ని తాజాగా న్యూయార్క్ టైమ్స్ కథనం తేల్చింది.
‘రాష్ట్ర నేతలు, ప్రజలపై నిఘా పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసింది. అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని, కోర్టును టార్గెట్‌ చేసి వారి ఫోన్‌ ట్యాప్‌ చేసింది.. ఇది దేశద్రోహం.. మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడింది’ అని విప‌క్ష‌నేత‌లు ప‌లువురు ట్వీట్ చేస్తున్నారు. వాస్త‌వంగా పెగాసిస్ స్పైవేర్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రాక‌ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ పై విప‌క్షాలు అనుమానాలు వ్య‌క్తం చేశాయి. ఆ త‌రువాత పెగాసిస్ బ‌య‌ట‌కు రావ‌డంతో సుప్రీం కోర్టు, పార్ల‌మెంట్ వ‌ర‌కు దీనిపై వివాదం న‌డిచింది. దేశంలోని ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, జ‌డ్జిలు, పారిశ్రామికవేత్త‌ల ఫోన్లు ట్యాప్ జ‌రిగిందని విప‌క్షాలు ఆరోపించాయి. దానిపై ప్ర‌భుత్వం వైపు నుంచి మ‌రో ర‌కంగా వాద‌న బ‌య‌లు దేరింది. ఒప్పందం ప్ర‌కారం ఇజ్రాయెల్ నుంచి పెగాసిస్ ను కొనుగోలు చేసిన మాట వాస్తవం. ఆ త‌రువాత దాన్ని ఎలా ఉప‌యోగించారో తెలియ‌చేస్తూ ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాన్ని తాజాగా ప్ర‌చురించింది. దీంతో మ‌రోసారి పెగాసిస్ వ్య‌వ‌హారం దుమారం రేపుతోంది.