PM Modi : `ముంద‌స్తు`దిశ‌గా మోడీ, ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌భుత్వం ర‌ద్దు?

గుజ‌రాత్, హిమాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా మోడీ `ముంద‌స్తు`కు వెళ్లే అవ‌కాశం ఉందని ఢిల్లీ కేంద్రంగా ప్ర‌చారం మొద‌ల‌యింది.

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 04:52 PM IST

గుజ‌రాత్, హిమాచ‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా మోడీ `ముంద‌స్తు`కు వెళ్లే అవ‌కాశం ఉందని ఢిల్లీ కేంద్రంగా ప్ర‌చారం మొద‌ల‌యింది. తొలుత జ‌మిలి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావించిన కేంద్రం వెన‌క్కు త‌గ్గింది. ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదం బీజేపీలో ఎప్ప‌టి నుంచో ఉంది. దాన్ని అమ‌లు చేయ‌డానికి అనువైన మార్గాల కోసం దేశంలోని రాజ‌కీయ పార్టీల‌తో మోడీ భేటీ అయిన విష‌యం విదిత‌మే. కానీ, జ‌మిలి సాధ్య‌ప‌డ‌ద‌ని భావించిన కేంద్రంగా ముంద‌స్తుకు వెళ్ల‌డానికి సిద్ధం అవుతున్న‌ట్టు బీజేపీ వ‌ర్గాల్లోని వినికిడి.

డిసెంబర్ లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వ‌హించ‌బోతున్నారు. ఆ స‌మావేశాల్లో కీల‌క బిల్లుల‌ను ఆమోదించ‌డం ద్వారా ఫిబ్రవరి చివరి వారంలో కేంద్ర క్యాబినెట్ రద్దు చేసే యోచనలో మోడీ స‌ర్కార్ ఉంద‌ని లేటెస్ట్ రూమ‌ర్స్. వాటికి బ‌లం చేకూరేలా బీజేపీ నాయకులను ప్రజల్లో ఉండాలని మోడీ ఆదేశించారు. అంతేకాదు, ఆర్థిక సహాయం అందించే పథకాలను వేగవంతం చేయాలని అధికారులకు ఆయ‌న సూచించారు. ఎంపీలు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండాల‌ని మోడీ, షా ద్వ‌యం ప‌దేప‌దే చెబుతున్నారు. ఇలాంటి సంకేతాలు వాళ్ల నుంచి రావ‌డంతో ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయ‌మ‌నే భావ‌న కలుగుతోంది. అయితే, గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశ రాజ‌కీయాల‌ను డిసైడ్ చేసే అవ‌కాశం ఉంది.

డిసెంబరు 1 మరియు 5 తేదీల్లో గుజ‌రాత్ ఎన్నిక‌లు రెండు విడ‌త‌లుగా జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను బలపరిచేందుకు పలన్‌పూర్, దేహ్గామ్, మోదాసా మరియు బావ్లాలో నాలుగు ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ భార‌త్ అమృత కాలంలోకి ఎంట్రీ ఇచ్చింద‌ని గుర్తు చేశారు. రాబోవు 25 ఏళ్ల అభివృద్ధి గుజ‌రాత్ ఫ‌లితాలు ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని మోడీ చెబుతున్నారు. డిసెంబర్ 8న ఫలితాలు గుజ‌రాత్ లో వెల్లడికానున్నాయి. సానుకూలంగా ఆ ఫ‌లితాలు ఉంటే లోక్ స‌భ‌కు సాధార‌ణ ఎన్నిక‌లు ముంద‌స్తుగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.