Modi-Adani : అడ్డ‌గోలు సామ్రాజ్యం కూలుతోన్న‌ వేళ! మోడీ రాజ‌నీతిపై దుమారం!

అడ్డ‌గోలు వ్య‌వ‌హారాలు చేయాలంటే ప్ర‌భుత్వం అండ‌దండ‌లు(Modi-Adani) ఉండాలి.

  • Written By:
  • Updated On - February 3, 2023 / 02:24 PM IST

అడ్డ‌గోలు వ్య‌వ‌హారాలు చేయాలంటే ప్ర‌భుత్వం అండ‌దండ‌లు(Modi-Adani) ఉండాలి. లేదంటే, ఎవ‌రూ ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌ను కాద‌ని ఒక్క‌డ‌గు కూడా ముందుకేయ‌లేరు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌హాయ‌, స‌హ‌కారాల‌తో ప్ర‌పంచ కుబేరునిగా ఎదిగిన ఆదానీ ఆర్థిక సామ్రాజ్యం కూలిపోతోంది. అదే స‌మ‌యంలో భార‌త (India)ఆర్థిక వ్య‌వ‌స్థ కూడా దిగ‌జారుతోంది. ఆదానీ గ్రూప్, ఇండియా ఆర్థికానికి లింకేమిటి అంటారా? ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎల్ ఐ సీ సుమారు 74వేల కోట్ల రూపాయాల‌ను ఆదానీ గ్రూప్ లో పెట్టుబ‌డులు పెట్టింది. ప్ర‌స్తుతం ఆదానీ గ్రూప్ నానాటికీ దిగ‌జారి పోతోంది. ఫ‌లితంగా షేర్ విలువ ప‌డిపోవ‌డంతో ఏకంగా రూ. 18వేల కోట్ల న‌ష్టాన్ని ఎల్ఐసీ చరిత్ర‌లో తొలిసారిగా చ‌విచూసింద‌ని ఆర్థిక వేత్త‌ల అంచ‌నా. ఇదంతా ప్ర‌జాధ‌న‌మే.

ప్ర‌పంచ కుబేరునిగా ఆదానీ ఆర్థిక సామ్రాజ్యం (Modi-Adani)

బ్యాంకులు ఇచ్చిన రుణాల‌ను గ‌మ‌నిస్తే యూపీఏ ప్ర‌భుత్వం ఉండ‌గా తీసుకున్న రుణం కంటే కొన్ని రెట్లు ఎక్కువ‌గా మోడీ స‌ర్కార్ హ‌యాంలో ఆదానీ గ్రూప్(Modi-Adani) పొందింది. దానికి తగిన ఆస్తులు, షేర్ విలువ లేద‌ని హిడెన్ బ‌ర్గ్ నివేదిక చెప్పే సారంశం. ఇంచుమించు తెలుగు రాష్ట్రాల్లో 2009వ సంవ‌త్స‌రంలో స‌త్యం రామ‌లింగ‌రాజు కంపెనీ కుంభ‌కోణం త‌ర‌హాలోనే ఆదానీ గ్రూప్ వ్య‌వ‌హారం ఇప్పుడు ఉంద‌ని ఆర్థిక వేత్త‌లు పోల్చుతున్నారు. కాక‌పోతే, ఆనాడు వెంట‌నే మ‌న్మోహ‌న్ సింగ్  ప్ర‌భుత్వం(India) న‌ష్ట నివార‌ణా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆదానీ గ్రూప్ ను ఆదుకోవ‌డ‌గానికి మోడీ స‌ర్కార్ పిల్లిమొగ్గ‌లు వేస్తోంద‌ని వ‌స్తోన్న ఆరోప‌ణ‌లు కోకొల్ల‌లు.

స‌త్యంను మించిన ఆదానీ కుంభకోణం

అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఆర్థిక అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఈ సందర్భంలో సత్యం కుంభకోణం గుర్తుకు రావడం సహజమే. లేని ఆదాయాన్ని చూపించి, పుస్తకాల్లో అంకెల గార‌డి చేసి షేర్ విలువను అమాంతం పెంచేసి అక్రమాలకు పాల్పడ్డాడు సత్యం రామలింగరాజు. సేమ్ టూ సేమ్ బహిరంగంగా షేర్ల విలువలో అవకతవకలు, అకౌంట్ మోసాలకు పాల్పడి, డొల్ల కంపెనీలతో నిర్మించిన మాయా సామ్రాజ్యంతో మార్కెట్‌ను అధోగతి పాలు చేశాడు ఆదానీ. సత్యం స్కాంలో రూ.14వేల కోట్ల మేరకు మోసం జరిగితే, అదానీ కుంభకోణం విలువ దాదాపు 9లక్షల కోట్ల పైమాటే.

Also Read : Adani FPO: అదానీ గ్రూప్ కీలక నిర్ణయం…FPO రద్దు

దేశాన్ని కుదిపేసిన కుంభకోణాల్లో అతి పెద్దవైన ఈ రెండు స్కాంల మధ్య పోలికలు, తేడాలను గ‌మ‌నిస్తే, 2009 లో సత్యం కుంభకోణం జరిగినప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. ప్రధానమంత్రిగా మన్ మోహన్ సింగ్ ఉన్నారు. సత్యం ఆర్థిక అవకతవకల గురించిన సమాచారం వెల్లడి అయిన మ‌రుక్ష‌ణం సీబీఐ దర్యాప్తుకు దిగి స్వాధీనం చేసుకుంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టింది. అనుభవజ్ఞులైన వారిని సత్యం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా నియమించి కంపెనీ కార్యకలాపాలను నియంత్రణ చేసింది. హెచ్‌డిఎఫ్‌సి ఛైర్మన్ దీపక్ పరేఖ్, మాజీ నాస్కామ్ ఛైర్మన్, ఐటి స్పెషలిస్ట్ కిరణ్ కర్నిక్, సెబి మాజీ సభ్యుడు సి అచ్యుతన్‌లు ఆ బోర్డులో సభ్యులు. వాటాదారులు మరియు రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి సెబీ వంటి సంస్థలు స్వేచ్ఛ‌గా ప‌నిచేశాయి. సత్యం రామలింగరాజుకు వ్యతిరేకంగా సీబిఐ పలు చార్జ్ షీట్ లను దాఖలు చేసింది. మొత్తానికి 2015 లో రామలింగరాజు కటకటాల పాలయ్యాడు. ఆయనకు సహాయం చేసిన వ్యక్తులకు, సంస్థలకు కూడా శిక్ష పడింది.

డొల్ల సామ్రాజ్యంలో…(India)

ఆదానీ గ్రూప్ విష‌యంలో భిన్నంగా జ‌రుగుతోంది. ప్రముఖ ఫైనాన్షియల్‌ ఫోరెన్సిక్‌ రిసెర్చ్‌ సంస్థ ‘హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌’ గౌతమ్ అదానీ, ఆయన కుటుంబసభ్యుల చీకటి చరిత్రను బయటపెట్టింది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆనాడు మ‌న్మోహ‌న్ సింగ్ వ్య‌వ‌హ‌రించిన‌ట్టు చేయ‌డం లేదు. దర్యాప్తు సంస్థలు రుజువులు చూపించగానే సత్యం రామలింగ రాజు ఆనాడు ఆర్థిక, అకౌంటింగ్ మోసాలను అంగీకరించాడు. కానీ, అదానీ అందుకు పూర్తి భిన్నంగా ఉన్నారు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని నడిపిస్తున్న పెద్ద‌ల అండ‌తో ఏదో చేయాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అదానీ కంపెనీల అక్రమాలపై దర్యాప్తు చేసి, రుజువులు చూప‌డానికి ఈడీ, సీబీఐ, ఐటీ, సెబీ లాంటి సంస్థలు ముందుకొచ్చే ప‌రిస్థితి ఇప్పుడు లేదు. ఇదే విష‌యాన్ని పార్ల‌మెంట్ వేదిక‌గా విప‌క్షాలు చెబుతున్నాయి.

2014 వ‌ర‌కు ఆదానీ గ్రూప్ తీసుకున్న అప్పులు, ఆ త‌రువాత మోడీ హ‌యాంలో తీసుకున్న అప్పుల‌ను గ‌మ‌నిస్తే క‌ళ్లు చెదిరే నిజాలు మ‌న ముందుక‌నిపిస్తాయి. వాటి వివరాల‌ను తీసుకుంటే..

========================
ఆదానీ గ్రూప్ తీసుకున్న అప్పు
=========================
2009 లో -130 కోట్లు
2010 లో – అప్పు తీసుకోలేదు
2011 లో – 583 కోట్లు
2012 లో – 696 కోట్లు
2013 లో -744 కోట్లు
———————————————-
మోడీ స‌ర్కార్ హ‌యాంలో..
———————————————-
2014 లో – 15,299 కోట్లు
2015 లో – 16,739 కోట్లు
2017 లో – 4959 కోట్లు
2018 లో – 2075 కోట్లు
2019 లో – 2869 కోట్లు
2020 లో – 17,707 కోట్లు
2021 లో – 51,657 కోట్లు
2022 లో – 72,260 కోట్లు
———————————————-

ఇండియాకు క‌ట్టే ప‌న్నుల్లో లాస్ట్ వ‌ర‌ల్డ్ టాప్ కుబేరుల్లో నెంబ‌ర్ -2

ఆదానీ గ్రూప్ కు ఏ మాత్రం తీసిపోకుండా పోటీప‌డుతూ కేంద్ర ప్ర‌భుత్వం అప్పుల వాటా అనూహ్యంగా పెరిగింది. 2014లో న‌రేంద్ర మోడీ ప్ర‌ధాన మంత్రి అయిన త‌రువాత చేసిన అప్పులు అక్ష‌రాల ₹169 లక్షల 46 వేల 666 కోట్లు! ఈ ఏడాది కొత్తగా తీసుకోనున్న అప్పులు ₹16 లక్షల 85 వేల కోట్లు! ప్ర‌స్తుతం కడుతున్న వడ్డీలు ₹10 లక్షల79 వేల కోట్లు!
అదే 1947 – 2014 మ‌ధ్య 67 ఏడేళ్ల కాలంలో 14 మంది ప్రధానులు చేసిన అప్పు కేవ‌లం 56 లక్షల కోట్లు. మోడీ ప్ర‌ధాని అయిన త‌రువాత ఈ ఎనిమిదేళ్ల‌లో ఆయ‌నొక్క‌డే చేసిన అప్పు 114 లక్షల కోట్లు. ఇవేమీ చాల‌వ‌న‌ట్టు ప్ర‌భుత్వ రంగం సంస్థ‌లు, ఆస్తుల‌ను అమ్మేసిన వైనం అంద‌రికీ తెలిసిందే. వీట‌న్నింటితో దేశానికి ఏమి చేశారు? అనేది ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్పాలి. అంద‌రికీ క‌నిపిస్తోంది మాత్రం ప్ర‌పంచ కుబేరుల జాబితాలో ఆదానీ రెండో స్థానానికి వ‌చ్చిన విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్యం. అంతేకాదు, అంత పెద్ద ప్ర‌పంచ కుబేరుడు ఇండియాకు క‌డుతోన్న ప‌న్నుల చెల్లింపుదారుల్లో టాప్ 15లో కూడా లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

ఆదానీ గ్రూప్ గురించి హిడెన్ బ‌ర్గ్ నివేదిక‌లోని కొన్ని కీల‌క అంశాలు (Modi-Adani)

*ఆదానీ గ్రూపుల స్థాపకుడు, చైర్మన్ ఇంచుమించు 120 బిలియన్ డాలర్లు (9 లక్షల 78 వేల కోట్ల రూపాయలు) ఆస్తిని కూడగట్టాడు. అందులో 100 బిలియన్ డాలర్ల ఆస్తి (8లక్షల 15 వేల కోట్ల రూపయలు) గత మూడేళ్ళలోనే షేర్ల ధరల పెరుగుదల వల్ల పోగుపడింది.

* ఆదానీ గ్రూపులో వున్న 22 మంది కీలక నాయకుల్లో 8 మంది ఆదాని కుటుంబ సభ్యులే. ఒక మాజీ అధికారి దీన్ని “కుటుంబ వ్యాపారం” అన్నాడు. (ఇందులో భారతీయులు ఆశ్చర్యపోయెదేమీ లేదు. 🙂 )

* 17 బిలియన్ డాలర్ల (లక్షా ముప్పైఎనిమిది వేల కోట్ల రూపాయలు) విలువగల వివిధ ఆర్థిక నేరాలు నాలుగింటిలో ఆదాని గ్రూపును ప్రభుత్వం విచారించింది. ఆదాని కుటుంబ సభ్యులు విదేశాల్లో షెల్ కంపెనీలు ఏర్పాటు చెయ్యడం, నకిలీ పత్రాలు తయరు చెయ్యడం లాంటి నేరాల్లో పాల్పంచుకున్నారు.

* ఆదానీ తమ్ముడు రాజేశ్ ఆదాని 2004-2005లల్లో డైమండ్ వ్యాపారానికి సంబందించిన నేరాల్లో నిందితుడు. రాజేష్ ని రెండుసార్లు అరెస్ట్ కూడా చేశారు. కానీ అతనే ఇప్పుడు ఆదాని గ్రూప్‌కు మేనేజింగ్ డైరెక్టర్.

* ఆదాని బావ, సమీర్ వోరా డైమండ్ వ్యాపారపు మోసాల్లో రింగ్ లీడర్ అని Director of Revenue Intelligence (DRI) ఆరోపించింది. అతనే ఇప్పుడు ఆదానీ ఆస్ట్రేలియా విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.

* ఆదాని అన్న వినోద్ ఆదానీని దొరకని దొంగగ మీడియా వర్ణిస్తూ వుంటుంది.ఈ వినోదే మారిషస్‌లోని కనీసం 38 షెల్ కంపెనీలను నడుపుతున్నాడు.

* వినోద్ ఆదాని నడిపే ఈ సంస్థలు  చేస్తున్నదేమిటో తెలియదు. అడ్రసులు లేవు, ఫోన్ నంబర్లు లేవు, వెబ్‌సైట్లు కూడా లేవు. కానీ ఇవే బిలియన్ల డాలర్ల పెట్టుబడులు ఆదానీ గ్రూపు కంపెనీల్లో పెట్టాయి.

* RTI చట్టం కింద సెబీని ప్రశ్నిస్తే ఈ నేరాల మీద విచారణ జరుగుతూ వున్నది నిజమే అని తేలింది.

* Elara (ఒక షెల్ కంపెనీ) CEOకు ధర్మేష్ దోషి, కేతన్ పరేఖ్ అనే షేర్ మార్కెట్ నేరస్తులతో సంబందాలున్నట్టు లీకైన ఈమెయిల్స్ ద్వారా తెలుస్తోంది.

* మరో షెల్ కంపెనీ మాంటెరోసా చైర్మన్ మరియు CEO మూడు కంపెనీల్లో కేతన్ పరేఖ్ లాంటి నేరస్తుడితో కలిపి డైరక్టర్‌గా వున్నాడు.

*అదానీ కనీసం హై స్కూల్ చదువు కూడా పూర్తి చెయ్యని ఒక స్కూల్ డ్రాప్ ఔట్.

*ముందు చిన్న వజ్రాల పరిశ్రమలో చిరు ఉద్యోగిగా మొదలు పెట్టిన సంపాదన జీవితం, తరువాత చిన్న చిన్న వ్యాపారాల తో మొదలు పెట్టి ఓడ రేవులు కొనే స్థాయికి ఎదిగాడు.

*2000 తరువాత మోడీతో పరిచయం ఇతడి జీవితాన్నీ పూర్తిగా మార్చేసింది.

ఆదానీ సామ్రాజ్యాల్లో నాడు గుజ‌రాత్ నేడు భార‌త్

గుజరాత్ సీఎంగా న‌రేంద్ర మోడీ ఉండ‌గా ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టులు దాదాపుగా ఆదానీకి ద‌క్కేవ‌ట‌. మోడీకి, RSS కు, బీజేపీ పార్టీకి ఆదానీ బినామీగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కార్పొరేట్ కంపెనీల‌కు, ప్రభుత్వాలకు మధ్య ఇలాంటి అవినాభావ సంబంధాలు స‌ర్వ‌సాధార‌ణం. ఎవరు పాలనలో ఉంటే వారికి పదో పరకో ఇచ్చి కోట్లల్లో లాభ పడుతుంటారు. పార్టీలకు ఫoడ్స్ కావాలీ, ఇలాంటి వారిని ప్రోత్సహించని పార్టీ అంటూ దాదాపుగా ఉండదు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంపై ఆదానీ ముద్ర ఉండేది. ఇప్పుప‌డు మోడీ ప్రధాన మంత్రి దేశం మీద ఆదానీ ముద్ర ప‌డింది. అంబానీలు ఎవరు అధికారంలో ఉంటే వారి వైపు ఉంటార‌ని రాజ‌కీయ పార్టీల‌కు తెలుసు. కానీ, అంబానీల‌కు ప్రత్యామ్నాయంగా ఆదానీ వైపు బీజేపీ మొగ్గిందని ఎవ‌ర్ని అడిగినా చెబుతారు.

Also Read : Gautam Adani: టాప్-10 బిలియనీర్ల జాబితా నుంచి గౌతమ్ అదానీ ఔట్

సార్వ‌త్రిక ఎన్నిక‌లు -2014 ముందు నుంచే జాతీయ స్థాయి ఖర్చులన్నీ బీజేపీ కోసం అదానీ భ‌రించాడ‌ని విప‌క్షాలు చెప్పే మాట‌. 2014 కు ముందు బీజేపీ లో మోడీ అంత బలమైన వ్వ్యక్తి కాదు. రాష్ట్ర బయటి రాజకీయ ఖర్చు అవసరాలు అన్నీ అదానీ నే భరించే వాడ‌ట‌. బీజేపీ వాదిలా విశ్వాస పాత్రుడి లా ఉన్న అదానీనీ చూసి మోదీ మురిసి పోయే వాడని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌. అవ‌స‌రానికి మించిన‌ రుణాలు బ్యాంకుల నుoచి కంటి సైగలతో మోడీ ఇప్పించాడ‌ని పార్ల‌మెంట్ వేదిక‌గా కాంగ్రెస్ తో స‌హా విప‌క్షాలు ఆరోప‌ణ‌ల‌కు దిగ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Adani: ఎల్‌ఐసీ మెడకు అదానీ ఉచ్చు!

ప్ర‌పంచ మొత్తం కోవిడ్ -19 కోర‌ల్లో చిక్కుకుని ఉన్న టైమ్ లో అంబానీనీ దాటి పోయి భారత దేశపు అపర కుబేరుడు ఆదానీ ఎదిగాడు. అంతేకాదు, జెట్ వేగంతో ప్ర‌పంచ రెండో స్థానానికి ఆదానీ ఈ రెండేళ్ల‌లో ఎగ‌బాకాడు. వివిధ దేశాల్లోని ప్రాజెక్టుల‌ను మోడీ వ్యూహాత్మ‌కంగా ఆదానీకి ఇప్పించ‌డాని కాంగ్రెస్ చేస్తోన్న ఆరోప‌ణ‌. దేశ‌, విదేశాల్లో డొల్ల కంపెనీల‌ను పెట్టుకుని అడ్డ‌దిడ్డంగా ఆదానీ ఎదిగాడు. క‌నీసం ల్యాండ్ ఫోన్ కూడా లేని సూట్ కేస్ కంపెనీల‌ను పెట్టుకుని ప్ర‌పంచ కుబేరుడుగా ఎద‌గ‌డాన్ని హిడెన్ బ‌ర్గ్ గుర్తించింది.

అదానీకు ఏం జరగవచ్చు

ఇలాగే కంపెనీ షేర్లు పతనం అయితే సెబీ భారత దేశంలో ట్రేడింగ్ ను స్తంబించ చేయవచ్చు. డీమాట్ అకౌంట్లు ఏవీ క్రయ విక్రాయలకు పని జేయక పోవచ్చు. అదానీ షేర్ల ట్రేడింగ్ ని ఆపి మిగితా వాటికి సడిలిoపు ఇవ్వచ్చు. అదానీ షేర్లు భారీగా పతనమై అట్ట‌డుగుకు చేరితే కొన్న వారికి లాక్ ఇన్ పీరియ‌డ్ పెట్టచ్చు. వీటిల్లో ఏదైనా జరగవచ్చు. ఇప్పటికీ షేర్ హోల్డ‌ర్ల‌లో మోడీ ఉన్నాడు ఆదానీ ని ఏదోర‌కంగా ఒడ్డున పడేస్తాడని ఆశ ఉంది.