San Reachel : ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మోడల్ శాన్ రీచల్ (San Reachel) ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం వేదన కలిగించే విషాదంగా మారింది. ఆమె ఆదివారం పుదుచ్చేరిలో తండ్రి ఇంట్లో అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె వయస్సు 26 సంవత్సరాలు మాత్రమే.
పోలీసుల సమాచారం ప్రకారం, ఆమె ఇంట్లో నుండి ఒక సూసైడ్ నోట్ కూడా గుర్తించారు. అందులో “నా మరణానికి ఎవరూ బాధ్యులు కావు” అంటూ రాసి పెట్టినట్లు తెలిపారు. ఆమె ఇటీవలే పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో వివాహబంధంలో సమస్యలేనా? కుటుంబ ఒత్తిడేనా? లేక ఆర్థిక ఇబ్బందులా? అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. తహశీల్దార్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణకు అధికారులు ఆదేశించారు.
రీచల్ ఇటీవల తన వృత్తిని కొనసాగించేందుకు ఆభరణాలను తాకట్టు పెట్టి విక్రయించాల్సి వచ్చిందని తెలిసింది. తండ్రిని ఆర్థిక సాయం కోరినప్పటికీ నిరాకరించాడట. “తండ్రి కొడుకుపై చూపిన ప్రేమను తనపై చూపలేదు” అనే భావన కూడా ఆమెను తీవ్రంగా ప్రభావితం చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
రీచల్ మోడలింగ్ ప్రపంచంలో మాత్రమే కాకుండా భారతీయ సినీ, ఫ్యాషన్ పరిశ్రమల్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. నల్లటి చర్మం గల మహిళలపై జరిగే వివక్ష గురించి ఆమె బహిరంగంగా మాట్లాడింది. ఫెయిర్ స్కిన్ ఆధిపత్యానికి ఆమె గట్టిగా ఎదురు నిలిచింది. 2022లో ‘మిస్ పుదుచ్చేరి’ టైటిల్ గెలుచుకోవడం ఆమె కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. తన మనోస్థైర్యంతో యువతకు ప్రేరణనిచ్చిన ఆమె, చివరికి మానసికంగా గుండెను విరిచేలా ఓ ఒత్తిడికి బలైంది.
ఆమె మరణం సినీ, మోడలింగ్ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేయడమే కాదు, మానసిక ఆరోగ్యంపై చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది. ప్రతిభ ఉన్న ఒక యువతిని సమాజం ఎలా నిరుత్సాహపరచవచ్చు అనే ప్రశ్నలకు ఇది ఉదాహరణగా నిలిచింది.
Tragedy : కన్న కొడుకు కళ్లముందే భర్తను నరికి చంపిన భార్య.. బీహార్‌లో దారుణం