Mob Attack – CM House : మణిపూర్ మండుతూనే ఉంది. చివరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ పూర్వీకుల ఇంటిపైనా అల్లరిమూకలు దాడికి యత్నించారు. గురువారం అర్ధరాత్రి టైంలో ఈ ఎటాక్ జరిగింది. అల్లరి మూకలు రెండు బ్యాచ్ లుగా ఏర్పడి.. రెండు వైపుల నుంచి సీఎం పూర్వీకుల ఇంటిని అకస్మాత్తుగా చుట్టుముట్టారు. దీన్ని వెంటనే గమనించిన భద్రతా బలగాలు వారిని తరిమేశాయి. ఈక్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిపాయి. దీంతో అల్లరి మూకలు అక్కడి నుంచి పారిపోయారు. మణిపూర్ లో అల్లర్లు మొదలైనప్పటి నుంచి ఈ ఇంట్లో సీఎం పూర్వీకులు ఎవరూ ఉండటం లేదని పోలీసు అధికారులు తెలిపారు.
Also read : Weather Today : తెలంగాణకు నాలుగు రోజులు వర్ష సూచన
‘‘అల్లరి మూకలు 150 మీటర్ల దూరంలో ఉండగానే గుర్తించి, వెంటనే సీఎం పూర్వీకుల ఇంటి విద్యుత్ కనెక్షన్ ను స్విచ్చాఫ్ చేశాం. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, మణిపూర్ పోలీసు సిబ్బంది అనేక రౌండ్ల టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో మూకలు పారిపోయారు ’’ అని పోలీసు అధికారులు వివరించారు. అయితే పోలీసులు కాల్పులు జరిపిన తర్వాత అక్కడ అంబులెన్స్‌లు కనిపించాయని మీడియాలో కథనాలు వచ్చాయి. పోలీసుల కాల్పుల్లో ఎవరైనా గాయపడ్డారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. ఆందోళనకారులు సీఎం ఇంటి సమీపంలోని రోడ్డుపై టైర్లను కాల్చారని తెలుస్తోంది. ఈ ఘటనతో మణిపూర్ లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని స్పష్టమైంది. సీఎం నివాసం దాకా అల్లరి మూకలు అవలీలగా చేరడాన్ని భద్రతా లోపం, ఇంటెలీజెన్స్ లోపంగా పరిగణించవచ్చని రక్షణరంగ నిపుణులు అంటున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి ఘటనలను చూడాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైతై వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులను హత్య చేసిన విషయం ఇటీవల వెలుగుచూడటంతో మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తతలు అలుముకున్నాయి. బుధవారం ఉదయం దీనిపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంఫాల్ లో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈనేపథ్యంలో అదే నగరంలోని సీఎం పూర్వీకుల ఇంటిపై దాడికి కొందరు యత్నించడం(Mob Attack – CM House) గమనార్హం.