MK Stalin : పొలిటిక‌ల్ హీరో “స్టాలిన్”..త‌మిళ‌నాట రాజ‌కీయ విప్ల‌వం

కాకి క‌ల‌కాలం బ‌తికినా..కోయిల కొద్దికాలం బ‌తికినా ఒక‌టే అంటారు పెద్ద‌లు. అలాగే, ప్ర‌ధాన మంత్రులుగా, ముఖ్య‌మంత్రులుగా ఎంత కాలం పరిపాల‌న చేసామ‌ని కాదు..ఎంత బాగా చేశారు అనేది ముఖ్యం.

  • Written By:
  • Publish Date - November 5, 2021 / 03:23 PM IST

కాకి క‌ల‌కాలం బ‌తికినా..కోయిల కొద్దికాలం బ‌తికినా ఒక‌టే అంటారు పెద్ద‌లు. అలాగే, ప్ర‌ధాన మంత్రులుగా, ముఖ్య‌మంత్రులుగా ఎంత కాలం పరిపాల‌న చేసామ‌ని కాదు..ఎంత బాగా చేశారు అనేది ముఖ్యం. దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయ‌ని విధంగా త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ చేస్తోన్న పాల‌న అద్భుతం. ఒక‌ప్పుడు అన్న ఎన్టీఆర్ సామాజిక‌, రాజ‌కీయ విప్ల‌వం తీసుకొచ్చేలా కొన్ని నిర్ణ‌యా‌లు ఉమ్మ‌డి ఏపీ సీఎంగా ఉన్న‌ప్పుడు తీసుకున్నాడు. ఇప్పుడు అదే కోవ‌లో త‌మిళ నాట సీఎం స్టాలిన్ సామాజిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక విప్ల‌వం తీసుకొచ్చేలా సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడు. పొలిటిక‌ల్ హీరోగా ప్ర‌శంసలు అందుకుంటోన్న త‌‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ అసెంబ్లీ క్యాంటిన్ ను మూసి వేస్తూ విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. స‌బ్సీడీ కింద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు అసెంబ్లీ క్యాంటిన్ ఆహార‌ప‌దార్థాల‌ను అందించేది. తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యంతో ఇక నుంచి లంచ్ బాక్స్ ల‌తో పాటు స్నాక్స్ కూడా అసెంబ్లీకి ప్ర‌జాప్ర‌తినిధులు తీసుకెళ్లాల్సిందే. కొన్ని కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం దుర్వినియోగం కాకుండా ఉండేలా స్టాలిన్ ఆ నిర్ణ‌యం తీసుకున్నాడు.

Also Read : పెట్రోల్ ధరలు తగ్గించిన మోదీ, కారణాలివే

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రి, మంత్రులు ప్ర‌యాణిస్తుంటే, సామాన్యుల రాక‌పోకల‌ను ఆపేస్తారు. కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను మ‌ళ్లిస్తారు. ఫ‌లితంగా సామాన్యులు త‌ర‌చూ ఇబ్బందుల‌కు గుర‌వుతుంటారు. అందుకే, ఇక నుంచి వీఐసీల కోసం సామాన్యుల‌ను ఇబ్బంది పెట్టొద్ద‌ని స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. సీఎం స్టాలిన్ కాన్వాయ్ వ‌స్తున్న‌ప్ప‌టికీ త‌మిళ‌నాడులో సామాన్యుల రాక‌పోక‌ల‌ను ఆపేయ వ‌ద్ద‌ని ఆదేశించాడు. ప్ర‌స్తుతం జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను స్టాలిన్ పొందుతున్నాడు. తాజాగా ఆయ‌న భ‌ద్ర‌త‌ను ఆయ‌నే స‌గానికి కుదించుకున్నాడు. సామాన్యుల వాహ‌నాల‌తో పాటు సీఎం కాన్వాయ్ ను కూడా పంపించాల‌ని ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని ఆదేశించాడు. వీఐపీ సంస్కృతికి శాశ్వ‌తంగా చెక్ పెట్టాడు.

అన్ని కులాల వారిని అర్చ‌కుల‌కు నియ‌మిస్తూ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. సామాజికంగా ఇదో విప్ల‌వాత్మ‌క‌మైన ముంద‌డుగు. ఎంతో సాహ‌సంతో స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో అమ‌లు చేస్తున్నారు. దేవాల‌యాల్లో ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇచ్చిన బ్రాహ్మ‌ణేత‌రుల‌ను అర్చ‌కులుగా నియ‌మించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఇత‌ర అట్ట‌డుగువ‌ర్గాలకు చెందిన వాళ్ల‌ను అర్చ‌కులుగా ఉద్యోగాలు ఇచ్చారు. దేశం మొత్తం స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణ‌‌యం వైపు ఆశ్చ‌ర్య‌క‌రంగా చూస్తోంది.నీట్ ప‌రీక్ష నుంచి త‌మిళనాడును మిన‌హాయించాల‌ని అసెంబ్లీలో స్టాలిన్ తీర్మానం చేశాడు. ఆ బిల్లును చ‌ట్ట రూపంలో తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోన్న స్టాలిన్ వైద్య విద్యార్థుల జేజేల‌ను అందుకుంటోంది. నీట్ నుంచి త‌మిళ‌నాడు రాష్ట్రాన్ని మిన‌హాయించాల‌ని కేంద్రాన్ని కోరాడు. త‌మిళనాడు విద్యార్థులు వైద్య విద్య‌ను అక్క‌డే అభ్య‌సించేలా నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇత‌ర రాష్ట్రాల విద్యార్థుల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేమ‌ని తేల్చి చెబుతూ అసెంబ్లీ తీర్మానం చేసి సంచ‌ల‌నం సృష్టించాడు.

త‌మిళనాడు అంత‌టా మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పించాడు. రాష్ట్రానికి చెందిన అన్ని ర‌కాల బ‌స్సుల్లోనూ ఉచితంగా ప్ర‌యాణం చేయ‌డానికి వీలు క‌ల్పించాడు. ఆ నిర్ణ‌యం అమ‌లు అంశాన్ని ప‌రిశీలించ‌డానికి స్టాలిన్ స్వ‌యంగా సిటీ బ‌స్సు ఎక్కి ప్ర‌యాణించాడు. డ్యూటీకి వెళ్లే పోలీసుల‌కు ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని క‌ల్పించాడు. ఏ జిల్లాలో ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ త‌మిళ‌నాడు అంత‌టా ఉచితంగా వెళ్ల‌డానికి అవ‌కాశం క‌ల్పించాడు. పోలీస్ డిపార్ట్ మెంట్ లోని ప్ర‌తి ఒక్క‌రికీ వీక్లీ ఆఫ్ ల‌ను ప్ర‌క‌టించాడు. పోలీస్ కుటుంబీల‌కు ఉచిత వైద్య సేవ‌ల‌ను అందిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.స‌చివాల‌యం, అసెంబ్లీ కి రావాల‌నుకునే సామాన్యుల‌కు ప్ర‌త్యేక‌మైన సౌక‌ర్యాల‌ను స్టాలిన్ క‌ల్పించాడు. ప్ర‌త్యేకించి దివ్యాంగుల‌కు వీల్ చైర్లు అందుబాటులో ఉంచేలా చ‌ర్య‌లు తీసుకున్నాడు. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలి రోజుల్లోనే కోవిడ్ బాధితుల‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా ఆలోచించాడు. ప్రైవేటు ఆస్ప‌త్రుల‌ను ప్ర‌భుత్వ ఆధీనంలోకి తీసుకున్నాడు. అంద‌రికీ స‌మానంగా వైద్య సేవ‌ల‌ను అందించాడు. ఉచితంగా ఆహారం, నిత్యావస‌రాల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి అనుగుణంగా ఆదేశాలు ఇచ్చాడు.

Also Read : నగలు అమ్మి.. లక్షల మంది దాహం తీర్చింది!

వ్యాక్సినేష‌న్ విష‌యంలోనూ మిగిలిన రాష్ట్రాల కంటే త‌మిళ‌నాడు ముందుంది. అమ్మ క్యాంటిన్ల‌ను య‌థాత‌దంగా నిర్వ‌హిస్తూ అన్నార్తుల ఆక‌లి తీర్చుతున్నాడు. గ‌త ప్ర‌భుత్వం తాలూకూ ప‌థ‌కాల‌కు మ‌రింత మెరుగులు దిద్దుతూ, వినూత్నంగా పాల‌న సాగించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాడు.మాన‌వీయ కోణంలో ఆలోచిస్తూ, సామాన్యుల ప‌క్షాన నిలుస్తోన్న స్టాలిన్ ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. దేశంలోని ఏ రాష్ట్ర సీఎం చేయ‌ని విధంగా నిరాడంబ‌ర పాల‌న సాగిస్తూ సామాన్యుల‌ కోణం నుంచి ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడు. తాజాగా అసెంబ్లీ క్యాంటిన్లు మూసివేయ‌డం, అర్చ‌కుల‌ను బ్రాహ్మ‌ణేతురు‌ల‌ను నియ‌మించ‌డం సామాజికంగా, రాజ‌కీయంగా విప్ల‌వాత్మ‌క‌మైన‌ నిర్ణ‌యాల‌ని చెప్ప‌కోవచ్చు.