Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వచ్చే వారం చైనాను సందర్శించనున్నారు. ఇది ఆయనకు ఐదేళ్ల విరామం తర్వాత మొదటి చైనా పర్యటన కావడం విశేషం. ద్వైపాక్షికంగా సుదీర్ఘంగా సాగుతున్న ఉద్రిక్తతల నేపధ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా హోస్ట్ చేసిన రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అనంతరం జైశంకర్ పర్యటన జరగడం గమనార్హం. 2020లో తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వద్ద భారత-చైనా సైనికులు ఎదురెదురుగా నిలిచిన ఘటనల అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రమైన మలుపు తిశాయి. గాల్వన్ లోయ ఘర్షణకు తోడు ఉన్న ఉత్కంఠ, పరస్పర అవిశ్వాస వాతావరణం ద్వైపాక్షిక సంప్రదాయాలను మసకబారేలా చేసింది.
Read Also: Gold- Silver Prices: వామ్మో.. ఒకేరోజు ఏకంగా రూ. 4 వేలు పెరిగిన ధర!
కానీ ఇటీవలే రెండు దేశాలు తిరిగి యాత్రికుల కోసం కైలాస మానసరోవర మార్గాన్ని తెరిచిన నేపథ్యంలో, సంబంధాలు మళ్లీ సానుకూల దిశగా అడుగులు వేస్తున్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. జైశంకర్ పర్యటనలో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయని సమాచారం. మొదట ఆయన చైనా రాజధాని బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వాస్తవ నియంత్రణ రేఖపై కొనసాగుతున్న ఉద్రిక్తతలు, మౌలికంగా ఏర్పడిన నమ్మక లోపాలను చర్చించనున్నారని భావిస్తున్నారు. ఇక, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి కూడా త్వరలో భారత్‌కు పర్యటన చేయనున్నారని పీటీఐ పేర్కొంది. ఈ సందర్భంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఆయన ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు.
రెండు దేశాలు ద్వైపాక్షికంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ ఉన్నాయనడానికి ఇది సంకేతంగా కనిపిస్తోంది. జైశంకర్ పర్యటనలో చర్చకు వచ్చే అంశాలు ఎంతో కీలకమైనవే. ముఖ్యంగా సరిహద్దు వివాదాలు, దలైలామా వారసత్వానికి సంబంధించిన చర్చలు, భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై చైనా వైఖరి, అలాగే ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సేవలు పునఃప్రారంభం వంటి అంశాలు చర్చలకు కేంద్ర బిందువుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జైశంకర్ చేసిన వ్యాఖ్యలు “భారత్-చైనా సంబంధాలు ప్రస్తుతం సానుకూల మార్గంలో పయనిస్తున్నాయి” అన్న మాటలు ఇప్పుడు ఈ పర్యటన ద్వారా ఆచరణాత్మకంగా సాకారం కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సంబంధాల పునర్నిర్మాణానికి ఇది ఒక అవకాశం కావొచ్చని వారు పేర్కొంటున్నారు.
ద్వైపాక్షిక సంబంధాల్లో గతంలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పునఃస్థాపించేందుకు ఇరు దేశాల మధ్య రాజకీయ సంకేతాలు మారుతూ ఉండటమే కాకుండా, ఆర్థిక, భద్రతా, మానవతా కోణాల్లో కూడా సహకారానికి మార్గం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంతో జైశంకర్ పర్యటనకు ఉన్న ప్రాముఖ్యత మరింత పెరిగింది. 2020 తర్వాత ఉత్కంఠభరితంగా మారిన బహుప్రత్యక్ష సంబంధాలను తిరిగి నమ్మకపూరితంగా మలుచుకునే అవకాశం ఇది కావొచ్చు. చర్చలు ఫలవంతం అయితే, ఇది దశాబ్దాలుగా సాగుతున్న సరిహద్దు వివాదాల పరిష్కారానికి చిన్న కానీ స్థిరమైన ముందడుగుగా నిలుస్తుందని నిపుణులు ఆశిస్తున్నారు.
Read Also: X Prices: ఎక్స్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన ప్రీమియం ప్లాన్ ధరలు!