Shiv Sena : ఇండియా కూటమికి ‘మహా’ షాక్.. షిండే గూటికి దిగ్గజ నేత

Shiv Sena : మహారాష్ట్ర కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

  • Written By:
  • Publish Date - January 14, 2024 / 11:50 AM IST

Shiv Sena : మహారాష్ట్ర కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరనున్నారు. ‘‘నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి ఉన్న 55 ఏళ్ల బంధాన్ని ముగించాను’’ అని X (ట్విట్టర్) వేదికగా మిలింద్ దేవరా ఒక పోస్ట్ పెట్టారు. ‘‘గత కొన్నేళ్లుగా నాకు అచంచలమైన మద్దతును అందిస్తున్న అందరు నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత  మురళీ దేవర కుమారుడే మిలింద్ దేవర.  మిలింద్ 2004,  2009 సంవత్సరాల్లో ముంబై సౌత్ లోక్‌సభ సీటు నుంచి గెలుపొందారు. 2014, 2019 సంవత్సరాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన (అవిభక్త) పార్టీ నాయకుడు అరవింద్ సావంత్‌పై పోటీ చేసి మిలింద్ దేవర మొదటి రన్నరప్‌గా నిలిచారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పుడు ఇండియా కూటమిలో శివసేన (ఉద్ధవ్) వర్గం(Shiv Sena) భాగంగా ఉంది. మిలింద్ దేవరకు మంచి పట్టున్న ముంబై సౌత్ లోక్‌సభ సీటులో సిట్టింగ్ ఎంపీ శివసేన (ఉద్ధవ్) వర్గం నాయకుడే ఉన్నాడు. దీంతో ఆ సీటును శివసేన (ఉద్ధవ్)కే  కాంగ్రెస్ వదిలేసే అవకాశాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తు కోసం, ముంబై సౌత్ సీటుపై పట్టుకోసం మిలింద్ దేవర మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన వర్గంలో చేరేందుకు రెడీ అయ్యారు. తన అనుచరులతో భేటీ అయిన అనంతరం దీనిపై మిలింద్ నిర్ణయం తీసుకున్నారు. ‘‘మా నాన్న మురళీ దేవరాతో ఉన్న అనుబంధాన్ని మరువలేను. ఆయనకు అన్ని రాజకీయ పార్టీల్లోనూ సన్నిహిత మిత్రులు ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకే అండగా నిలిచే ధృడమైన కాంగ్రెస్‌వాది’’ అని ట్విట్టర్ వేదికగా మిలింద్ వ్యాఖ్యానించారు.

Also Read: Bhogi – Horoscope : భోగి రోజు.. మీ రాశిఫలితం ఇదిగో

యూపీ తర్వాత లోక్‌సభ సీట్ల ప్రకారం రెండో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. మహావికాస్ అఘాడీలో భాగంగా ఉన్న కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) శరద్ పవార్ వర్గం నేతల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయి. రాష్ట్రంలోని మొత్తం 48 సీట్లలో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయంపై మూడు పార్టీల నేతలు అవగాహనకు వచ్చినట్టు తెలిసింది. అయితే ఏయే స్థానాలు ఎవరు పంచుకోవాలన్న అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. 2019లో బీజేపీ – శివసేన కలిసి పోటీ చేయగా.. 25 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ 23 చోట్ల గెలుపొందింది. 23 సథానాల్లో పోటీ చేసిన శివసేన 18 స్థానాల్లో గెలుపొందింది. ఇదే తరహాలో కాంగ్రెస్ – ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. 25 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ చంద్రాపూర్ నియోజకవర్గం ఒక్కటే గెలుచుకోగలిగింది. ఎన్సీపీ 19 స్థానాల్లో పోటీ చేసి 4 గెలుచుకుంది. అయితే ఈ నాలుగున్నరేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు సమూలంగా మారిపోయాయి. రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న శివసేన, ఎన్సీపీలు రెండుగా చీలిపోయాయి. ఆయా పార్టీల వ్యవస్థాపక కుటుంబాలు కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం సాగిస్తుండగా.. చీలిక వర్గాలు మాత్రం బీజేపీతో కలిసి నడుస్తున్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యే సంఖ్యాబలం చీలికవర్గానికే ఎక్కువగా ఉన్నప్పటికీ, పార్టీలో నేతలు, కార్యకర్తలు తమవైపే ఎక్కువ మంది ఉన్నారని వ్యవస్థాపక కుటుంబాల నేతలు భావిస్తున్నారు. ఈ స్థితిలో ఈ రాష్ట్రంలో పొత్తులు, సీట్ల సర్దుబాటు, సమన్వయం సరిగా చేసుకుంటే 48 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కూటమి గెలుపొందవచ్చని అంచనా వేస్తున్నారు.