Delhi Coaching Centre Deaths: దేశ రాజధాని ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో వర్షం కారణంగా నీరు నిండిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో శనివారం సాయంత్రం నేలమాళిగలోని లైబ్రరీలో వర్షం నీరు నిండిపోవడంతో ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి చనిపోయారు. కాగా ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
జులై 27న ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లో ఒక్కసారిగా నీరు నిండిపోవడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయా యాదవ్, తెలంగాణకు చెందిన తాన్యా సోని, కేరళలోని ఎర్నాకులంకు చెందిన నివిన్ డాల్విన్ ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాద సమయంలో దాదాపు 30 మంది విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. 14 మంది విద్యార్థులను పోలీసులు రక్షించారు. మిగిలిన విద్యార్థులు తప్పించుకోగలిగారు. అయితే ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నేలమాళిగలో నీటిమట్టం తగ్గడంతో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
ముగ్గురు విద్యార్థుల మృతి తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ విషాద ప్రమాదం తర్వాత ఆ ప్రాంతంలోని 13 కోచింగ్ సెంటర్లను సీల్ చేసింది. వారు అన్ని నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. అదే సమయంలో ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయో, బేస్‌మెంట్ లోపల ఎన్ని సెంటర్లు నడుపుతున్నారో పూర్తి డేటా తెప్పించుకుని ఢిల్లీ వ్యాప్తంగా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు.
Also Read: Academic Calendar 2024-25 : ఏపీలో దసరా, సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే..!!