Yogi Adityanath : తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపులు వచ్చాయి. సీఎం పదవికి రాజీనామా చేయకుంటే ఆయనను చంపేస్తామంటూ ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్ లైన్ నంబరుకు శనివారం సాయంత్రం ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఆ ఫోన్ నంబరును ట్రాక్ చేసిన పోలీసులు.. అది ఎవరు పంపారు అనేది గుర్తించారు. మహారాష్ట్రలోని థానే పరిధిలో ఉన్న ఉల్హాస్‌నగర్ ఏరియాకు చెందిన 24 ఏళ్ల యువతి ఫాతిమా ఖాన్ ఈ మెసేజ్‌ను పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆమె ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేసింది. అయితే ఫాతిమా మానసిక స్థితి అస్థిరంగా ఉందని పోలీసులకు వారి కుటుంబీకులు తెలిపారు. ‘‘యోగి ఆదిత్యనాథ్ 10 రోజుల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయకపోతే మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీలాగా చంపేస్తాం’’ అని ఆమె వార్నింగ్ మెసేజ్‌ను పంపింది. మానసిక స్థితి సరిగ్గా లేకున్నా.. ఈ మెసేజ్‌ను ఎలా పంపింది ? సీఎం యోగిని(Yogi Adityanath) టార్గెట్‌గా ఎందుకు ఎంచుకుంది ? ఫాతిమా నిజంగా మానసిక సమస్యలతో బాధపడుతోందా ? అనేది తెలుసుకునే దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఫాతిమాను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హత్య బెదిరింపుల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంది.
Also Read :India Vs Canada : చేతికి కట్టుకున్న దారాలను చూపిస్తూ.. కెనడా ప్రధాని ట్వీట్
వరుస బెదిరింపులు.. అరెస్టులు
- ‘‘రూ.2 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం’’ అంటూ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ఒక వ్యక్తిని అక్టోబర్ 30న అరెస్టు చేశారు. ముంబైలోని బాంద్రా ఈస్ట్‌కు చెందిన ఆజం మహ్మద్ ముస్తఫా అనే వ్యక్తి ఈ వార్నింగ్ మెసేజ్ పంపినట్లు వెల్లడైంది.
- గత నెలలోనే అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ హత్యకు గురయ్యారు. ఇటీవలే ఆయన కుమారుడు జీషాన్ సిద్దిఖీకి కూడా హత్య బెదిరింపు వచ్చింది. ఈ వార్నింగ్ పంపిన 20 ఏళ్ల యువకుడిని అక్టోబర్ 29న నోయిడాలో అరెస్టు చేశారు. అతడి పేరు మహ్మద్ తయ్యబ్.
- అక్టోబరు 22న సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు మెసేజ్ పంపిన 24 ఏళ్ల షేక్ హుస్సేన్ మౌసిన్‌ను జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షేక్ హుస్సేన్ మౌసిన్ కూరగాయలు అమ్ముకునేవాడు.