Site icon HashtagU Telugu

UP Election Results 2022: యూపీలో “మాయ‌మైన” మాయావ‌తి

Up Election Results 2022 Mayavathi

Up Election Results 2022 Mayavathi

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌రుగున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచానాలు నిజమవుతున్నాయి. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, అక్క‌డ అధికారం చేప‌ట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 202 స్థానాలు దాటాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుత కౌంటిగ్ గ‌మ‌నిస్తే, అధికార బీజేపీ మ్యాజిక్ ఫిగ‌ర్ దాటి 241 స్థానాల్లో అధిక్యంతో దూసుకుపోతూ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ మెజార్టీతో గెలిచే అవ‌కాశం క‌నిపిస్తుంది.

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో మ‌రోసారి క‌మ‌ల వికాసానికి కార‌ణం ప్రధాని నరేంద్ర మోడీ మానియాకు యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ తోడుకావడమే అని విశ్లేష‌కులు అంటున్నారు. మోదీ-యోగి ఆదిత్యనాథ్‌లు యూపీలో డంబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ బీజేపీ ఎన్నికల్లో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీ చేసిన ప్రచారానికి తమ ఓట్ల ద్వారా యూపీ ప్రజలు ఆమోదం తెలిపారు. యూపీ 35 ఏళ్ళ త‌ర్వాత‌ అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావ‌డం విశేషం. దీంతో వ‌రుస‌గా రెండో సారి యోగీ ఆదిత్య‌నాథ్ ముఖ్య‌మంత్రి కానున్నారు.

ఇక మ‌రోవైపు స‌మాజ్ వాదీ పార్టీ కూట‌మి ప్ర‌స్తుతం 121 స్థానాల్లో అధిక్యంలో ఉంది. దీంతో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు యూపీ అధికార పీఠం అందని ద్రాక్షే అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. బీఎస్పీ5 స్థానాలు, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉండ‌గా, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక‌పోతే ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌ను శాసించిన మాయావతి కనుమరుగు కాబోతున్నార‌ని తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు చెబుతున్నాయి. దళిత, బ్రాహ్మణ ఓటు బ్యాంకుతో గతంలో మాయావ‌తి అధికారంలోకి వచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఓటు బ్యాంగ్ మొత్తం ఇత‌ర పార్టీల‌కు త‌ర‌లి పోవ‌డంతో మాయావ‌తి ఈసారి యూపీ ఎన్నికల్లో ప్రభావం చూపించ లేకపోయారు.

ఇక యూపీలో గత పార్లమెంటు ఎన్నికల్లో స‌మాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న‌ మాయావతి చారిత్ర‌క త‌ప్పిదం చేశారు. ఆ త‌ర్వాత త‌న‌ తప్పును సరిదిద్దుకున్న మాయావ‌తి, ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా తన పార్టీకి సంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంకును మాత్రం రాబట్టుకోలేకపోయారు. ఈసారి యూపీలో మొత్తం 403 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసినా, ప్ర‌స్తుతానికి 5 స్థానాల్లోనే ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. దీంతో ఉత్త‌రప్ర‌దేశ్‌లో మాయావ‌తి పార్టీ నామ‌రూపాలు లేకుండా పోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ఎన్నిక‌ల్లో తొలి నుంచే మాయావ‌తి అండ్ టీమ్ యాక్టీవ్‌గా క‌నిపించ‌లేదు. మ‌రోవైపు యూపీలో బీజేపీ దుమ్ము రేపుతుండ‌డంతో, యూపీలో పుట్టిన‌ మాయావ‌తి పార్టీ దాదాపు మాయ‌మ‌వ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ‌విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.