Omicron : భార‌త్‌లో భారీగా ప‌డిపోయిన మాస్క్‌ల వినియోగం

భారతదేశంలో మాస్కుల వినియోగం 60 శాతం కంటే తక్కువకు పడిపోయిందని నీతి ఆయోగ్ స‌భ్యుడు వి.కె.పాల్ అన్నారు.

  • Written By:
  • Publish Date - December 11, 2021 / 12:51 PM IST

భారతదేశంలో మాస్కుల వినియోగం 60 శాతం కంటే తక్కువకు పడిపోయిందని నీతి ఆయోగ్ స‌భ్యుడు వి.కె.పాల్ అన్నారు.ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై ఆందోళ‌న పెరుగుతున్న నేప‌థ్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ గ‌ణాంకాల‌ను విడుదల చేసింది. దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య త‌గ్గ‌డంతో మాస్క్ ల వాడ‌కం కూడా త‌గ్గింద‌ని గ‌ణాంకాలు తెలిపాయి. 2021 ఫిబ్ర‌వ‌రి నాటికి మాస్క్ ల వాడ‌కం 60శాతానికి ప‌డిపోయింద‌ని పేర్కోంది. అయితే తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ నేప‌థ్యంలో యాక్టీవ్ కేసులు పెర‌గ‌డం…మాస్క్ వాడ‌కం కూడా పెరిగింది.బూస్టర్ డోస్‌ల కోసం ఇంకా ఎలాంటి సిఫార్సులు ఇవ్వలేదని పాల్ తెలిపారు. వ్యాక్సినేషన్‌ను అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యతగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని WHO స్పష్టం చేసింది. 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికి రెండు డోసులతో టీకాలు వేయడం పూర్తి చేయాలనే ల‌క్ష్యంతో తాము ఉన్నామ‌ని పాల్ తెలిపారు.

ఈ ఏడాది మే – జూన్ మ‌ధ్య మాస్క్ ల వాడ‌కం గిరిష్ట స్థాయికి చేరుకుంది. అ స‌మ‌యంలో క‌రోనా రెండ‌వ ద‌శ వ్యాప్తి చెందింది. మాస్క్ వాడ‌క‌పోతే తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని వీకే పాల్ తెలిపారు. మాస్క్ ల‌ను వ‌దిలించుకోవ‌డానికి ఇంకా స‌మ‌యం రాలేద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. మాస్క్ అనేది యూనివర్సల్ సోషల్ వ్యాక్సిన్ అని…టీకాలు వేసుకున్నా కూడా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. మిజోరాం, కేరళ,సిక్కింలలోని అనేక జిల్లాల్లో కోవిడ్ టెస్ట్ పాజిటివిటీ 10 శాతానికి పైగా ఉందని… ఈ జిల్లాల్లో సంక్రమణ వ్యాప్తి చెందుతుందని అగర్వాల్ సూచించారు.

దక్షిణ సిక్కిం జిల్లాలో అత్యధికంగా 25.78 శాతం పరీక్ష పాజిటివ్‌గా ఉందని ఆయన చెప్పారు. మిజోరాంలోని హ్నాథియాల్ జిల్లాలో కూడా 22.10 శాతం పాజిటివిటీ రేటు ఉంద‌న్నారు. భారతదేశంలోని ఐదు రాష్ట్రాల నుండి ఓమిక్రాన్ వేరియంట్ కేసులు 25 నమోదయ్యాయని అగర్వాల్ తెలిపారు. మహారాష్ట్రలో 10, రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో మూడు, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒకటి ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రోగులందరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయని అగర్వాల్ చెప్పారు. అంతర్జాతీయ ప్రయాణికులు ల్యాండింగ్ తర్వాత తరచుగా తప్పుడు చిరునామాలు ఇస్తారని.. వారికి క‌రోనా పాజిటివ్ గా తెలిన‌ట్ల‌యితే అధికారులు వారిని సంప్రదించడం కష్టమని అగర్వాల్ తెలిపారు.ప్ర‌యాణికులు స‌రైన వివ‌రాలు అందిస్తే వారికి స‌కాలంలో చికిత్స అందుతుంద‌ని ప్ర‌తి ఒక్క‌రి కుటుంబాలు సుర‌క్షితంగా ఉంటాయ‌ని ఆయ‌న తెలిపారు. విమానాశ్ర‌యాల్లో ప్ర‌యాణికులు దిగిన‌ప్పుడు చిరునామాల‌ను త‌ప్పుగా చెప్పోద్ద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. డిసెంబరులో రోజువారీ సగటు టీకా రేటు పెరిగిందని…వయోజన జనాభాలో 86.2 శాతం మంది వ్యాక్సిన్ ఫ‌స్ట్ డోస్ తీసుకున్నార‌ని తెలిపారు. జనాభాలో 53.5 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నార‌ని ల‌వ్‌ అగర్వాల్ తెలిపారు. పండుగ నెలలైన అక్టోబర్, నవంబర్‌లలో రోజువారీ వ్యాక్సిన్ మోతాదుల సగటు సంఖ్య వరుసగా 55.77 లక్షలు నుంచి 9.33 లక్షల డోస్‌లకు తగ్గగా… డిసెంబర్ నెలలో మరోసారి 78.66 లక్షలకు పెరిగిందని ఆయన తెలిపారు