Site icon HashtagU Telugu

Marriage Hall On Wheels: మొబైల్ కల్యాణమండపం..ఆనంద్ మహీంద్రా ప్రశంస

Marriage Hall Imresizer

Marriage Hall Imresizer

అత్యంత విశిష్టమైనవి,కొత్తతరహాగా రూపొందించిన వస్తువులు, వాహనాలు, వినూత్న ప్రయోగాలను ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటూ అందుకు కారణమైనవారిని ప్రోత్సహిస్తుంటారు. అటువంటివారికి కొందరికి సహాయం కూడా చేస్తుంటారు.అది ఆయన ప్రత్యేకత. అదే ఆయనకు తృప్తి కూడా. ఆయన ఇప్పుడు మరో వినూత్న ప్రయోగాన్ని మన ముందుకు తీసుకువచ్చారు.
సాధారణంగా మనం మొబైల్ టిఫిన్ సెంటర్లు, మొబైల్ వాష్ రూములు, మొబైల్ క్లినిక్‌లు…వంటివి చూస్తుంటాము. మరో ప్రయోగంతో నూతన ఆవిష్కరణలకు కొదవలేదని నిరూపణ అయింది. పెళ్లిళ్ల సీజన్ సమయంలో కల్యాణ మండపాల కోసం వెదుక్కోవాలి. మనమే కల్యాణమండపం వద్దకు వెళ్లాలి. అయితే, కల్యాణమండపమే మన వద్దకు వస్తే ఎలా ఉంటుంది? అది ఊహించలేమంటారా? ఇది నిజమే. కల్యాణ మండపం మన వద్దకు రావడమే నూతన ఆవిష్కరణ.

ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న మొబైల్ కల్యాణ మండపం భావనను ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు.ఓ షిప్పింగ్ కంటైనర్‌ను ఓ అద్భుతమైన కల్యాణమండపంగా మలచిన తీరుకు ఆయన ముగ్ధుడయ్యారు. ఓ కల్యాణమండపంలో ఉండే అన్ని సౌకర్యాలు అందులో ఉంటాయి. దానిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘‘ఈ ఉత్పత్తి భావన, దీని రూపకల్పన వెనుక ఉన్న వ్యక్తిని నేను కలవాలనుకుంటున్నాను. ఇది సృజనాత్మకం, ఆలోచనాత్మకమైనది కూడా. మారుమూల ప్రాంతాలకు కల్యాణమండప సదుపాయాన్ని అందించడమే కాకుండా, జనాభా దట్టంగా ఉండే ప్రదేశాలలో శాశ్వత స్థలాన్ని తీసుకోనందున పర్యావరణ అనుకూలమైనదిగా కూడా ఉంటుంది’’ అని ప్రశంసించారు. ఆ మొబైల్ కల్యాణమండపం వీడియోను కూడా ట్వీట్ చేశారు. ఆ వీడియోలో ఓ ట్రక్కు కల్యాణమండపంగా ఎలా మారుతుందో చూడవచ్చు.