MARD Party : దేశంలో మహిళల హక్కుల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇటువంటి తరుణంలో ఓ రాజకీయ పార్టీ పురుషుల హక్కుల కోసం పోరాడుతోంది. లక్ష్యానికి తగ్గట్టే ఈ రాజకీయ పార్టీ పేరు మర్ద్ (MARD). మర్ద్ అంటే.. మేరా అధికార్ రాష్ట్రీయ దళ్ (MARD). వరకట్న నిషేధ చట్టం, గృహ హింస చట్టంతో ముడిపడిన అక్రమ కేసులను ఎదుర్కొంటూ బాధపడుతున్న పురుషుల సమస్యల పరిష్కారం కోసం ఈ పార్టీ ఉద్యమిస్తోంది. దీన్ని 2009 సంవత్సరంలో స్థాపించారు. ఈ రాజకీయ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి పలు ఎన్నికల్లోనూ పోటీ చేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి, లక్నో స్థానాల్లో మర్ద్ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. 2020 సంవత్సరంలో యూపీలోని బంగార్‌మౌలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ మర్ద్ పార్టీ అభ్యర్థిని నిలిపింది. 2022 సంవత్సరంలో జరిగిన యూపీ ఎన్నికల్లో బరేలీ, లక్నో నార్త్, బక్షి కా తలాబ్ (లక్నో), చౌరీ చౌరా అసెంబ్లీ స్థానాల్లో మర్ద్ పార్టీ పోటీ చేసింది.
We’re now on WhatsApp. Click to Join
2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మర్ద్ పార్టీ ఎన్నికల బరిలో నిలిచింది. లక్నో, గోరఖ్‌పూర్, రాంచీ లోక్‌సభ స్థానాల్లో ఈ పార్టీ అభ్యర్థులు నిలబడ్డారు. లక్నో లోక్‌సభ స్థానం నుంచి ఈసారి మర్ద్ పార్టీ అధ్యక్షుడు కపిల్ మోహన్ చౌదరి ఉన్నారు. ఈయన 1999 సంవత్సరం నుంచి వరకట్న వేధింపుల కేసును ఎదుర్కొంటున్నారు. ఆయనపై నమోదైన వరకట్నం కేసు నేటికీ అపరిష్కృతంగానే ఉండటం గమనార్హం. ‘‘నాకు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా పిల్లలు ఇద్దరినీ మొదటి భార్య తీసుకెళ్లిపోయింది. అంతేకాదు నాపై వరకట్నం, గృహ హింస కేసులు బనాయించింది. లక్నోలో ఉంటూ నేను ఈ కోర్టు కేసులపై పోరాటం చేశాను. ఈ టైంలోనే నాలాగ మహిళల నుంచి అక్రమ కేసులు ఎదుర్కొంటున్న వారిని కలిశాను. వారందరినీ కలుపుకొని రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాను’’ అని 52 ఏళ్ల కపిల్ మోహన్ చౌదరి చెప్పారు. ‘‘భార్య నుంచి నేను విడాకులు తీసుకున్నాను. కానీ నాపై వరకట్నం కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈవిధంగా అణచివేతకు గురవుతున్న పురుషుల హక్కులను హైలైట్ చేయడానికి నేను రాజకీయ పార్టీని స్థాపించాను’’ అని కపిల్ చెప్పుకొచ్చారు. మర్ద్ రాజకీయ పార్టీ ట్యాగ్‌లైన్ ‘మర్ద్ కో దర్ద్ హోతా హై’ (పురుషులు నొప్పిని అనుభవిస్తారు).
Also Read : AP Elections : ఏపీలో భారీ పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్ ?
గోరఖ్‌పూర్, రాంచీ లోక్‌సభ స్థానాల నుంచి మర్ద్ పార్టీ తరఫున సోనూరాయ్, ధనంజయ్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ పార్టీ మేనిఫెస్టోలో ఆసక్తికరమైన హామీలు ఉన్నాయి. పురుషుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, నేషనల్ కమిషన్ ఫర్ మెన్ ఏర్పాటు వంటివి ఈ పార్టీ వాగ్దానాలు. మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాల కారణంగా పురుషులకు అన్యాయం జరగకుండా నిరోధించడానికి ‘పురుషుల భద్రతా బిల్లు’ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలనేది ఈ పార్టీ లక్ష్యం. పురుషులకు ఆపదలో సాయం చేయడానికి ‘పురుషుల పవర్ లైన్’ను ఏర్పాటు చేస్తామని ఈ పార్టీ అంటోంది. ఈ పార్టీలో కొందరు మహిళలు కూడా సభ్యులుగా ఉన్నారు. మర్ద్ పార్టీ లక్ష్యం పురుషుల హక్కులను పరిరక్షించడమే తప్ప.. మహిళల హక్కులకు భంగం కలిగించడం కాదని కపిల్ స్పష్టం చేశారు.