Site icon HashtagU Telugu

Chhattisgarh : మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలి: అమిత్‌ షా

Maoists should lay down their arms and join the mainstream of public life: Amit Shah

Maoists should lay down their arms and join the mainstream of public life: Amit Shah

Chhattisgarh : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో పర్యటించారు. అక్కడ రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన బస్తర్‌ పణ్‌డూమ్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ..మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. బస్తర్‌ గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరన్నారు. మార్చి 2026 నాటికి నక్సల్‌ సమస్య అంతమవుతుందని అమిత్‌ షా తెలిపారు. లొంగిపోయి మావోయిస్టులకు అభివృద్ధిలో భాగమైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి రక్షణ ఉంటుందన్నారు. గతేడాది మొత్తంగా 881 మంది మావోయిస్టులు లొంగిపోగా.. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 521 మంది లొంగిపోయినట్లు చెప్పారు.

Read Also: WhatsApp New Feature: వాట్సాప్‌లో మీరు పంపే ఫైళ్లు సేవ్ కావొద్దా ? ఇదిగో ఫీచర్

ఏ మావోయిస్టు చనిపోయినా ఎవరిలోనూ సంతోషం లేదు. ఆయుధాలు అడ్డం పెట్టుకొని స్థానిక గిరిజనుల అభివృద్ధిని ఆపలేరు అని అమిత్‌ షా పేర్కొన్నారు. బస్తర్‌లో బుల్లెట్‌ కాల్పులు, బాంబు పేలుళ్ల రోజులు ముగిశాయి. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా మాలో భాగమే అని అమిత్‌ షా అన్నారు. స్థానికులు వైద్య, విద్య సదుపాయాలతోపాటు ఆధార్‌, రేషన్‌ కార్డులు, ఆరోగ్య బీమా పొందినప్పుడే ఇది సాధ్యమవుతుందన్న ఆయన.. నక్సల్స్‌ సమస్య తొలగిపోతేనే బస్తర్ అభివృద్ధి చెందుతుందన్నారు. 50 ఏళ్లుగా బస్తర్‌ అభివృద్ధికి దూరమైందన్న అమిత్‌ షా.. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే నిశ్చయంతో ప్రధాని మోడీ ఉన్నారని చెప్పారు.

బస్తర్ పణ్‌డూమ్ వేడుకలను వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహిస్తామని అమిత్‌షా ప్రకటించారు. ఆ పండుగకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తాను ఆహ్వానిస్తామని చెప్పారు. మరోవైపు మావోయిస్టురహిత గ్రామాల్లో రూ.కోటి విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ హామీ ఇచ్చారు.

Read Also: Show Cause Notices : రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు