Maoists Peace Talks: ‘‘ప్రభుత్వాలతో శాంతి చర్చలకు సిద్ధం’’ అని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సంచలన ప్రకటన చేసింది. అయితే ఈవిషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటిదాకా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తుపాకీతో ఘర్షణ జరిగింది. ఇప్పుడు ప్రభుత్వాల ప్రతినిధులు, మావోయిస్టుల ప్రతినిధుల మధ్య శాంతిచర్చలు జరగాల్సిన వేళ ఆసన్నమైంది. ఒకవేళ ఇందుకు కేంద్ర సర్కారు సిద్ధమైతే.. శాంతి దిశగా బాటలు పడతాయి. అడవుల్లో రక్తపుటేరులు పారవు. ఎంతోమంది భద్రతా బలగాలు, మావోయిస్టుల ప్రాణాలు నిలుస్తాయి. సామాజిక వికాసం దిశగా అడుగులుపడతాయి.
Also Read :Doddi Komurayya: వీర యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి.. పోరాట విశేషాలివీ
అలా చేస్తే.. చర్చలకు మేం రెడీ : మావోయిస్టులు
‘‘మేం గత 15 నెలల్లో దేశవ్యాప్తంగా 400 మందికిపైగా మావోయిస్టులను, ఆదివాసీలను కోల్పోయాం. మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ యుద్ధం నరసంహారం (జీనోసైడ్)గా మారింది. అందుకే ప్రజల ప్రయోజనాల కోసం మేం శాంతి చర్చలకు సిద్ధమయ్యాం. శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేం ప్రతిపాదిస్తున్నాం. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర (గడ్చిరోలి), ఒడిశా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్న హత్యాకాండలను, నరసంహారాన్ని నిలిపివేయండి. ఏజెన్సీ ప్రాంతాల్లో సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే మేం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తాం. శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని శాంతి చర్చల కమిటీకి, దేశంలోని ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు, మీడియాకు, హక్కుల సంఘాలకు, ఆదివాసీ, దళిత సంఘాలకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. ‘‘మధ్య భారతదేశంలో జరుగుతున్న యుద్ధాన్ని(Maoists Peace Talks) వెంటనే ఆపాలి. భారత ప్రభుత్వం-సీపీఐ (మావోయిస్టు) బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలి’’ అనే అంశంపై మార్చి 24న హైదరాబాద్‌లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిందని గుర్తు చేసింది. దీనికి స్పందనగానే ఈ లేఖ విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది.
Also Read :BSNL: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఏంటంటే?
కేంద్ర సర్కారు ఏం చేయనుంది ?
వాస్తవానికి కేంద్రంలోని మోడీ సర్కారు సమాజంలో శాంతి స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈవిషయంలో ఎలాంటి రాజీ లేకుండా పనిచేస్తోంది. ప్రస్తుతం దట్టమైన అడవులు ఉన్న రాష్ట్రాలకే మావోయిస్టులు పరిమితం అయ్యారు. అందుకే ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు చేపడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను చేపట్టాలనే గొప్ప సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే మణిపూర్, అసోం, నాగాలాండ్ లాంటి అత్యంత సమస్యాత్మక ఈశాన్య రాష్ట్రాల్లోనూ అతివాద సంస్థలు, రాడికల్ ఆర్గనైజేషన్లతో కేంద్ర సర్కారు విజయవంతంగా చర్చలు జరిపింది. ఎన్నో మిలిటెంట్ సంస్థలు ఆయుధాలను వదిలేసి జనజీవన స్రవంతిలో కలిశాయి. దీనికి సంబంధించిన వార్తలను మనం గూగుల్ సెర్చ్ చేసి కూడా చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆయా సంస్థలతో చర్చలు జరపబట్టే ఇవన్నీ జరిగాయి. ఇందుకు కొనసాగింపుగా భవిష్యత్తులో మావోయిస్టులతోనూ కేంద్ర సర్కారు జరిపే అవకాశాలు లేకపోలేదు. అయితే ఆయుధాలను వదిలేయాలనే షరతును మోడీ ప్రభుత్వం తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. అందుకు మావోయిస్టులు అంగీకరిస్తేనే శాంతిచర్చల ప్రక్రియ ముందుకు జరగొచ్చు.