Kobad Ghandy : కోబాడ్ గాంధీపై వేటు వేసిన మావోయిస్టు పార్టీ…కార‌ణం ఇదే…?

మావోయిస్ట్ పార్టీ కేంద్ర క‌మిటీ మాజీ స‌భ్యుడు కోబాడ్ గాంధీని ఆ పార్టీ బ‌హిష్క‌రించింది. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతూ...సిద్ధాంతాన్ని విడిచిపెట్టార‌నే ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న‌పై వేటు ప‌డింది.

  • Written By:
  • Publish Date - December 2, 2021 / 11:14 AM IST

మావోయిస్ట్ పార్టీ కేంద్ర క‌మిటీ మాజీ స‌భ్యుడు కోబాడ్ గాంధీని ఆ పార్టీ బ‌హిష్క‌రించింది. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతూ…సిద్ధాంతాన్ని విడిచిపెట్టార‌నే ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న‌పై వేటు ప‌డింది. ఈ విష‌యాన్ని మావోయిస్టు పార్టీ అధికార ప్ర‌తినిధి అభ‌య్ పేరుతో లేఖ విడుదల అయింది. 2019లో జైలు నుంచి విడుదలైన తర్వాత కోబాడ్‌ గాంధీ రాసిన ‘ఫ్రాక్చర్డ్ ఫ్రీడమ్ – ఎ ప్రిజన్ మెమోయిర్’ పుస్తకంలో ఉద్యమాన్ని చెడుగా చూపించారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

“మార్క్సిజం-లెనినిజం-మావోయిస్ట్ భావజాలం ముఖ్య సిద్ధాంతాలను విడిచిపెట్టి, “ఆదర్శవాదం, ఆనందం, ఆధ్యాత్మికత” అనే బూర్జువా తత్వాన్ని స్వీకరించినందుకు గాంధీని బహిష్కరిస్తున్న‌ట్లు మావోయిస్టు పార్టీ తెలిపింది. పుస్తకంలో చేసిన అన్ని వ్యాఖ్యలు త్వరలో తగిన సమాధానం ఇస్తామని ప్రకటించారు.

ముంబైలోని ఒక సంపన్న పార్సీ కుటుంబంలో జన్మించిన కోబాడ్ గాంధీ.. బ‌హుళ‌జాతీ కంపెనీలో కొంతకాలం పనిచేశారు. 1970ల చివరలోఆయ‌న ఉద్యమంలో చేరారు. కొండపల్లి సీతారామయ్య స్థాపించిన అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెన్నిస్ట్) పీపుల్స్ వార్‌లో 1981లో సెంట్రల్ కమిటీ సభ్యునిగా ప‌ని చేశారు. సెప్టెంబరు 2004లో పీపుల్స్ వార్, MCCI (మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా)ని విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత పార్టీ CPI (మావోయిస్ట్)ని సెప్టెంబరు 2004లో ఏర్పాటు చేశారు. నేపాల్ మావోయిస్టు నాయకుడు ప్రచండతో 2005లో సమావేశం నిర్వ‌హించారు.

ఉద్యమం లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైందని, మార్క్సిస్టు జీవన విధానంలో సంతోషం, స్వేచ్ఛ లేవని గాంధీ ఆరోపించార‌ని…ఇది పార్టీ వ్య‌తిరేక‌కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ‌టమేన‌ని అభ‌య్ తెలిపారు.2019లో జైలు నుంచి విడుదలైన తర్వాత గాంధీ త‌మ‌ని సంప్రదించ లేద‌ని… పుస్తకంలోని కంటెంట్, పుస్తకం రాయాలనే ఉద్దేశ్యం గురించి త‌మ‌తో చర్చించలేదన్నారు. ఇది స్వయంగా పార్టీ సిద్ధాంతాలను ఉల్లంఘించడమేన‌ని ఆయ‌న తెలిపారు. 40 ఏళ్లకు పైగా పార్టీలో భాగమైన ఆయన పార్టీపై ఆరోపణలు చేయడం త‌ప్ప‌ని మావోయిస్టు అధికార ప్ర‌తిన‌ధి అభ‌య్ తెలిపారు.

2009లో న్యూఢిల్లీలో అరెస్టై…2019లో విడుదలయ్యాడు. ఆయ‌న‌ తన జైలు శిక్షలో ఎక్కువ భాగం విశాఖపట్నం సెంట్రల్ జైలులో గడిపాడు. జైలులో తనకు మంచి జీవితం ఉందని, నేరగాళ్లు, జైలు అధికారులతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని గాందీ రాయడంపై పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయ‌న తన పుస్తకంలో క్రిమినల్ గ్యాంగ్‌లను, జైలు అధికారులను ప్రశంసించడం సిగ్గుచేటని పార్టీ పేర్కొంది. మావోయిస్టులకు వివిధ మాఫియాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన చేసిన ఆరోపణలను కూడా తాము ఖండిస్తున్నామని అభయ్ అన్నారు.