Chintan Shivir: కీలక నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ జాతీయ కమిటీ

పార్టీలో సమూలమైన మార్పులు తేవడంతో పాటు అధికారమే లక్షంగా ఎలా పనిచేయాలనే విషయాలని చర్చించడానికే కీలక సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ చింత‌న్ శిబిర్ స‌మావేశాలు ముగిశాయి.

పార్టీలో సమూలమైన మార్పులు తేవడంతో పాటు అధికారమే లక్షంగా ఎలా పనిచేయాలనే విషయాలని చర్చించడానికే కీలక సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ చింత‌న్ శిబిర్ స‌మావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన సీడబ్ల్యూసీ భారీ మార్పులకు ఆమోదం తెలిపింది. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గించి 50 శాతం ప‌ద‌వులు 50 ఏళ్ళ లోపు వారికే ఇచ్చేందుకు పార్టీ నిర్ణయం తీసుకొంది. పార్టీ పరమైన సంస్థాగత పదవుల్లో ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, మ‌హిళ‌ల‌కు స‌మాన ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

ఒక వ్యక్తికి ఓకే ప‌ద‌వి ఇవ్వాలనే అంశంతో పాటు ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇవ్వాలనే నిర్ణయం కూడా కాంగ్రెస్ ఆదిస్థానం తీసుకుంది. అయిదేళ్లు పార్టీలో క్రియాశీల‌కంగా ఉంటేనే కుటుంబంలో రెండో టికెట్‌ ఇవ్వాలని, పార్టీ ప‌ద‌విలో అయిదేళ్లకు మించి ఎవ‌రూ కొనసాగకూడదని పార్టీ కండిషన్ పెట్టుకుంది. జాతీయ, రాష్ట్ర‌, జిల్లా ప‌దాధికారుల ప‌నితీరుపై ఎప్పటికప్పుడు స‌మీక్ష‌ చేయడంతో పాటు, ప‌నిచేయ‌ని వారి అధికారాల‌కు క‌త్తెర‌ వేసేలా ప్రణాళిక రూపొందించారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కొత్తగా మూడు డిపార్ట్‌మెంట్లు అమల్లోకి రానున్నాయి. ప‌బ్లిక్ ఇన్‌సైట్ డిపార్ట్‌మెంట్, నేష‌న‌ల్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్, ఎలక్షన్ మెనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌ అనే నూతన కమిటీలు పార్టీలో కీలకంగా ఉండనున్నాయని సమాచారం. రాబోయే 90 నుంచి 180 రోజుల్లో బ్లాక్ నుంచి జాతీయ‌స్థాయి వ‌ర‌కు అన్ని ప‌ద‌వుల భ‌ర్తీ, మండ‌ల స్థాయి క‌మిటీల ఏర్పాటు జరగాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఏడాదికోసారి తప్పనిసరిగా జాతీయ‌, రాష్ట్ర కాంగ్రెస్ క‌మిటీ స‌మావేశాలు జ‌ర‌గాలని నిర్ణయించారు.