Site icon HashtagU Telugu

కేజ్రీవాల్, మాన్ హర్యానా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి – సీఎం మ‌నోహ‌ర్‌లాల్ ఖట్టర్

Kejriwal

Kejriwal

చండీగఢ్‌ను రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శనివారం తీవ్రంగా ఖండించారు. హర్యానా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్య‌మంత్రి భగవంత్ మాన్ ను డిమాండ్ చేశారు. శుక్రవారం పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. పంజాబ్ ప్రభుత్వం చేసిన పని ఖండించదగినద‌నంటూ ఖ‌ట్ట‌ర్ తెలిపారు. హర్యానా, పంజాబ్‌లకు చండీగఢ్ రాజధాని అని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ దీన్ని ఖండించాలని, హర్యానా ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఖట్టర్ అన్నారు. అలాగే, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా హర్యానా ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. చండీగఢ్ .. హర్యానా, పంజాబ్‌లకు రాజధాని అని, అలాగే ఉంటుందని ఖట్టర్‌ శుక్రవారం చెప్పారు. చండీగఢ్‌తో పాటు ఇరు రాష్ట్రాలు మాట్లాడుకోవాల్సిన అనేక ఇతర అంశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం, ఇతర ఉమ్మడి ఆస్తుల పరిపాలనలో సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపిస్తూ చండీగఢ్‌ను తక్షణమే పంజాబ్‌కు మార్చాలని కోరుతూ పంజాబ్ అసెంబ్లీ శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతకుముందు వాకౌట్ చేసిన ఇద్దరు బిజెపి శాసనసభ్యులు గైర్హాజరు కావడంతో మన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ ఉద్యోగులకు కేంద్ర సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మండిపడ్డారు.