Mann Ki Baat: ‘మన్ కీ బాత్’ 129వ ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ఈ ఏడాది ‘ఆపరేషన్ సింధూర్’ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందన్నారు. నేటి భారతదేశం తన భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని ప్రపంచం స్పష్టంగా చూసింది. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో ప్రపంచ నలుమూలల నుండి భారత్ పట్ల ప్రేమ, భక్తితో కూడిన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ‘వందేమాతరం’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు కూడా ఇదే భావం కనిపించింది” అని అన్నారు. 2025 సంవత్సరం ప్రతి భారతీయుడు గర్వపడేలా అనేక క్షణాలను అందించిందని ప్రధాని పేర్కొన్నారు. దేశ భద్రత నుండి క్రీడా మైదానం వరకు, సైన్స్ ప్రయోగశాలల నుండి ప్రపంచ వేదికల వరకు భారత్ తనదైన ముద్ర వేసింది.
సైన్స్ & స్పేస్: భారత్ అంతరిక్ష రంగంలో భారీ అడుగు వేసింది. శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకున్న మొదటి భారతీయుడిగా నిలిచారు.
వన్యప్రాణుల సంరక్షణ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత్‌లో ఇప్పుడు చిరుతల సంఖ్య 30 కంటే ఎక్కువకు చేరుకుంది.
Also Read: టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ ఆటగాడు!
‘మహాకుంభం, అయోధ్య రామమందిరం’
“2025లో విశ్వాసం, సంస్కృతి, భారతదేశ ప్రత్యేక వారసత్వం అన్నీ ఏకకాలంలో కనిపించాయి. ఏడాది ఆరంభంలో ప్రయాగ్‌రాజ్ మహాకుంభం నిర్వహణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఏడాది చివరలో అయోధ్య రామమందిరంపై జెండా ఎగురవేసే వేడుక ప్రతి భారతీయుడిని గర్వంతో నింపింది” అని ప్రధాని అన్నారు. స్వదేశీ ఉత్పత్తుల పట్ల ప్రజలు చూపిస్తున్న ఉత్సాహాన్ని కూడా ఆయన మెచ్చుకున్నారు.
దుబాయ్‌లోని ‘కన్నడ పాఠశాల’ ప్రస్తావన
దుబాయ్‌లో నివసిస్తున్న కన్నడ కుటుంబాల కృషినీ ప్రధాని అభినందించారు. సాంకేతిక ప్రపంచంలో తమ పిల్లలు ఎదుగుతున్నప్పటికీ తమ మాతృభాషకు దూరం కాకూడదనే ఉద్దేశంతో వారు ‘కన్నడ పాఠశాల’ను ప్రారంభించారు. పిల్లలకు కన్నడ చదవడం, రాయడం, మాట్లాడటం నేర్పించడం గొప్ప ప్రయత్నమని ఆయన అన్నారు. అలాగే Geetanjali IISc ఇప్పుడు కేవలం ఒక క్లాస్ మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక కేంద్రంగా మారిందని, అక్కడ శాస్త్రీయ సంగీతం, జానపద కళలు విరాజిల్లుతున్నాయని తెలిపారు.
మణిపూర్ యువకుడి స్ఫూర్తిదాయక గాథ
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 గురించి మాట్లాడుతూ.. విద్యార్థులు 80కి పైగా ప్రభుత్వ విభాగాల సమస్యలకు పరిష్కారాలను కనుగొన్నారని ప్రధాని చెప్పారు. మణిపూర్‌కు చెందిన 40 ఏళ్ల లోపు యువకుడు మొయిరాంగ్తెమ్ సేథ్ గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మారుమూల ప్రాంతంలో ఉంటూ విద్యుత్ సమస్యను ఎదుర్కొన్న ఆయన, సోలార్ పవర్ ద్వారా లోకల్ సొల్యూషన్ కనుగొని “సంకల్పం ఉంటే మార్గం ఉంటుంది” అని నిరూపించారు.
పార్వతీ గిరి జన్మశతాబ్ది
జనవరి 2026లో ఒడిశాకు చెందిన పార్వతీ గిరి జన్మశతాబ్ది వేడుకలు జరగనున్నాయని ప్రధాని తెలిపారు. ఆమె కేవలం 16 ఏళ్ల వయసులోనే ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తన జీవితాన్ని సమాజ సేవకు, గిరిజనుల సంక్షేమానికి అంకితం చేస్తూ అనేక అనాథ శరణాలయాలను స్థాపించారు. ఆమె జీవితం తరతరాలకు మార్గదర్శకంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు.
