Site icon HashtagU Telugu

Manipur Elections 2022: మణిపూర్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం..!

Manipur Elections 2022

Manipur Elections 2022

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలు తొలిదశ పోలింగ్‌ సోమవారం ప్రారంభమైంది. మణిపూర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్న సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో ఈరోజు ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, తొలి దశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి.

నిజానికి ఆదివార‌మే యూపీ ఐదో ద‌శ ఎన్నిక‌ల‌తో పాటు మ‌ణిపూర్‌లో తొలి ద‌శ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే పోలింగ్ ఏర్పాట్ల‌లో జ‌రిగిన అంత‌రాయం కార‌ణంగా ఈ ఎన్నికలు ఈరోజుకి వాయిదా పడింది. ఇక తొలివిడతలోని 38 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 1,721 పోలింగ్‌ కేంద్రాలను అక్క‌డి ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ఏర్పాటు చేసింది. ఈ క్ర‌మంలో మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో 15 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నారు.

ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 12,09,439 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 5,80,607 మంది పురుషులు, 6,28,657 మంది మహిళలు మరియు 175 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. సీఎం బీరేన్‌ సింగ్‌లో పాటు ఉపముఖ్యమంతి జాయ్ కుమార్ సింగ్ కూడా ఈ తొలివిడత ఎన్నిక‌ల‌ బరిలో ఉన్నారు. ఇక మ‌ణిపూర్ ఎన్నిక‌ల‌ పోటీలో బీజేపీ మొత్తం 38 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 35 స్థానాల్లో పోటీ చేస్తుండగా, జనతాదళ్ (యునైటెడ్) 28 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది.

మ‌ణిపూర్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం స్థానాలకు గానూ కాంగ్రెస్ 28 సీట్లను సొంతం చేసుకుని, అక్క‌డ అతిపెద్ద పార్టీగా అవతరించినా, కేవ‌లం 21 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన బీజేపీ అధికారం చేపట్టింది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌, స్వతంత్రుల సాయంతో మ‌ణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈసారి బీజేపీ, ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్‌ విడివిడిగా పోటీచేస్తున్నాయి. ఇక మ‌ణిపూర్‌లో రెండో విడత పోలింగ్ మార్చి 5వ తేదీన జరగనుంది. రెండో విడతలో మిగిలిన 22 స్థానాలకు పోలింగ్‌ను నిర్వహిస్తారు. ఇక‌పోతే మార్చి 10వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.