Biren Singh : రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు తెలిపిన మణిపూర్‌ సీఎం

చాలామంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. మరికొందరు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Published By: HashtagU Telugu Desk
President Rule

President Rule

Biren Singh : జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ రావణకాష్టంలా రగులుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన దురదృష్టకర పరిణామాలపై ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ తాజాగా స్పందించారు. ఈ ఏడాది మొత్తం రాష్ట్ర ప్రజలకు కష్టకాలమని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. ”ఈ ఏడాది చాలా కష్టసమయంగా గడిచింది. చాలామంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. మరికొందరు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితిపై చింతిస్తున్నాను.. గత మే నెల నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై ప్రజలకు క్షమాపణలు కోరుతున్నాను” అని సీఎం బీరెన్‌ సింగ్‌ మీడియా ఎదుట పేర్కొన్నారు.

రాష్ట్రంలో 12,000కు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 625 మంది నిందితులను అరెస్ట్‌ చేయగా, 5,600 ఆయుధాలు, 35,000 మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత మూడు, నాలుగు నెలలుగా శాంతి స్థితిని చూస్తున్నాం. మణిపుర్‌ క్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తగిన భద్రతా సిబ్బందిని పంపింది. నిర్వాసితుల కోసం నిధులను కేటాయించింది. త్వరలో గృహా నిర్మాణాలను ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది నుంచి శాంతి స్థాపన సాధ్యమవుతుందని నమ్ముతున్నాను అని ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ అన్నారు.

కాగా, ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ రెండు జాతుల మధ్య వైరం హింసాత్మకంగా మారింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్లమెంట్‌ను కూడా ఈ అంశం కుదిపేసింది. గత మే నెలలో చెలరేగిన ఘర్షణలు యావత్‌ దేశాన్ని కలవరపరిచాయి. ఈ హింసాత్మక ఘటనల్లో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 వేల మందికిపైగా నివాసాలను కోల్పోయారు. మైతీలకు రిజర్వేషన్ల అంశంపై కుకీలు, మైతీల మధ్య చిచ్చు రేగింది.

Read Also: Drunker Thief : దొంగతనానికి వెళ్లి.. వైన్‌షాపు, బ్యూటీ పార్లర్‌లలోనే నిద్రపోయారు

  Last Updated: 31 Dec 2024, 04:34 PM IST