Miss Universe India 2025 : భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సౌందర్య పోటీల్లో ఒకటైన మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని ఈసారి రాజస్థాన్‌కి చెందిన మణిక విశ్వకర్మ గెలుచుకున్నారు. జైపూర్‌లో సోమవారం రాత్రి అట్టహాసంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో దేశం నలుమూలల నుంచి ఎంపికైన ఫైనలిస్టుల మధ్య కఠినమైన పోటీ జరిగింది. చివరికి అందరి కళ్లముందు వెలుగుల విందుగా సాగిన వేడుకలో మణిక విజేతగా నిలిచారు. గత ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న రియా సింఘా ఈసారి మణిక తలకు కిరీటాన్ని అలంకరించడం ఈ వేడుకకు మరింత ప్రత్యేకతని తీసుకొచ్చింది. ఈ విజయంతో మణిక విశ్వకర్మ రాబోయే నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ అంతర్జాతీయ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ ఫినాలేలో మరికొందరు పోటీదారులు కూడా అద్భుత ప్రతిభను కనబరిచి రన్నరప్ స్థానాలను దక్కించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, హర్యానాకు చెందిన మెహక్ ధింగ్రా సెకండ్ రన్నరప్‌గా, అమిషి కౌశిక్ థర్డ్ రన్నరప్‌గా ఎంపికయ్యారు. వీరందరి ప్రదర్శనలు సమానంగా మెప్పించినప్పటికీ చివరికి జ్యూరీ నిర్ణయం మణికకు అనుకూలించి కిరీటం ఆమె తలపై వెలిగింది.
Apple : బెంగళూరులో ‘యాపిల్’ అద్దె రూ.1,000 కోట్లు!
మణిక విశ్వకర్మ చిన్ననాటి నుంచే బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో జన్మించిన ఆమె ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తూ పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో చివరి సంవత్సరం చదువుతున్నారు. విద్యతో పాటు కళా రంగంలోనూ తనదైన ముద్ర వేసిన ఆమె, శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు. పెయింటింగ్‌లో తన ప్రతిభకు గుర్తింపుగా లలిత కళా అకాడమీ, జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి గౌరవాలు అందుకున్నారు. అంతేకాకుండా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బిమ్‌స్టెక్ సెవోకాన్’ కార్యక్రమంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా దేశ స్థాయిలో తన ప్రతిభను ప్రదర్శించారు.
అయితే మణిక ప్రయాణం కళలతో లేదా విద్యతో మాత్రమే పరిమితం కాలేదు. సామాజిక అంశాలపై ఆమె చూపుతున్న ఆసక్తి ప్రత్యేకంగా నిలుస్తుంది. న్యూరోడైవర్జెన్స్‌పై సమాజంలో అవగాహన కల్పించేందుకు ఆమె స్థాపించిన ‘న్యూరోనోవా’ అనే సంస్థ ఇప్పటికే చురుకుగా పనిచేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆమె, ఏడీహెచ్‌డీ వంటి సమస్యలను లోపాలుగా కాకుండా ప్రత్యేకమైన మేధోశక్తులుగా చూడాలని ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. మానసిక ఆరోగ్యం, భిన్న మేధో సామర్థ్యాల గుర్తింపు వంటి అంశాలపై మణిక చేస్తున్న కృషి ఆమె వ్యక్తిత్వానికి మరో అంచుని జోడించింది.
విజయం అనంతరం తన అనుభూతులను పంచుకుంటూ మణిక విశ్వకర్మ అన్నారు – “నా ప్రస్థానం నా సొంత ఊరు గంగానగర్ నుంచి మొదలైంది. ఢిల్లీకి వచ్చి ఈ పోటీల కోసం సిద్ధమయ్యాను. మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచుకోవాలి. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరి సహకారం ఉంది. నన్ను నమ్మి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మిస్ యూనివర్స్ పోటీలు కేవలం ఒక రంగం మాత్రమే కాదు, అవి వ్యక్తిత్వాన్ని నిర్మించే ఒక విశ్వం” అని పేర్కొన్నారు.
ఈ విజయంతో మణిక పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆమె వ్యక్తిత్వం కేవలం సౌందర్యం పరిమితుల్లో కాకుండా విద్య, కళలు, సామాజిక అవగాహనలతో కూడుకున్నది. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్న ఈ యువతీ ప్రస్థానం కొత్త తరం యువతకు ఒక ప్రేరణగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
Heavy Rain: తెలంగాణ, ఏపీకి భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!