Social Media : రీల్స్.. ఏ ముహూర్తాన టిక్ టాక్ వచ్చిందో గానీ.. అప్పటి నుంచీ పిల్లల నుంచీ పెద్దల వరకూ రీల్స్ చేయడం ఒక వ్యసనమయింది. ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేశాక.. యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లలో రీల్స్ ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒకటికి నాలుగైదు రీల్స్ యాప్స్ ఉండటంతో కొందరికి మిగతా పనులన్నీ వదిలేసి.. రీల్స్ చేయడమే పనిగా మారింది. ఫలితంగా సోషల్ మీడియాలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇది కొన్ని కుటుంబాలపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా అవి విచ్ఛిన్నమవడానికి దారితీస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో భార్య రీల్స్ పోస్ట్ చేయడం నచ్చని ఓ భర్త ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన కోల్ కతాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పరిమళ బైద్య (38) అనే వ్యక్తి తన భార్య (35) అపర్ణతో కలిసి హరినారాణపూర్ లో నివాసం ఉంటున్నాడు. అపర్ణ తరచూ రీల్స్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేది. అది నచ్చని భర్త.. తరచూ ఈ విషయమై గొడవ పడుతుండేవాడు. ఒక్కోసారి గొడవ తారాస్థాయికి చేరేది. ఎప్పటిలాగే అపర్ణ రీల్ పోస్టు చేయడంతో.. ఇతరులతో పరిచయాలు పెంచుకుంటోందన్న అనుమానంతో పరిమళ బైద్య ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెద్దది కావడంతో విచక్షణ కోల్పోయిన అతను.. అపర్ణ గొంతుకోసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న పరిమళ బైద్య కోసం వెతుకున్నారు.
కాగా.. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారని, ఘటన సమయంలో పిల్లలు ఇంటిలో లేరని పోలీసులు పేర్కొన్నారు. కొడుకు 7వ తరగతి చదువుతుండగా.. కూతురు నర్సరీ చదువుతోంది. పరిమళ బైద్య తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. అపర్ణ తరచూ.. మనీలెండింగ్ ఏజెన్సీకి చెందిన ఓ అధికారితో మాట్లాడటం సహించలేకే ఆమెను హతమార్చినట్లు అనుమానిస్తున్నారు.