కాంగ్రెస్ పార్టీ అధినేతగా మల్లికార్జునా ఖర్జే నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ,రాహుల్ గాంధీతోపాటు పలువురు సీనియర్ నేతలు, ఇతర పార్టీల సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఉదయం 10.30 గంటలకు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనికోసం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజ్ ఘాట్ , శాంతివాన్, విజయ్ ఘాట్, శక్తిస్థల్, వీర్ భూమి, సమత స్థల్ లను సందర్శిస్తారు. మంగళవారం సాయంత్రం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆయన నివాసంలో కలిశారు ఖర్గే.
కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడిగా, లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఖర్గే…పార్టీ అస్తిరంగా ఉన్న సమయంలో తన కొత్త పాత్రను పోషించేందుకు సిద్ధం అవుతున్నారు. రాజస్థాన్, చత్తీస్ ఘడ్, లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జార్ఖండ్ లో కూటమి ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లలో పార్టీ అధికారంలోకి వచ్చేలా చేయడం ప్రస్తుతం ఖర్గే ముందున్న సవాళ్లు. నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. కాగా గుజరాత్ ఎన్నికలపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.
అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను గద్దె దించిన ప్రధాని నరేంద్ర మోదీ నేత్రుత్వంలోని బీజేపీ నుంచి గట్టి సవాలును ఎదుర్కొంటున్న సమయంలో 80ఏళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఖర్గే స్వీకరించనున్నారు.