CWC Meeting : తెలంగాణ, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఖర్గే కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా.. సంవత్సరంలో 365 రోజుల పాటు ప్రజల మధ్యే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

  • Written By:
  • Updated On - June 8, 2024 / 03:18 PM IST

CWC Meeting : కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా.. సంవత్సరంలో 365 రోజుల పాటు ప్రజల మధ్యే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. నిత్యం ప్రజా సమస్యలను లేవనెత్తే చైతన్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సొంతమన్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు నియంతృత్వ, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు తగిన సమాధానం చెప్పారని ఆయన తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇండియా కూటమి పార్లమెంట్ లోపల, బయట సమష్ఠిగా ముందుకు సాగాలని ఖర్గే పిలుపునిచ్చారు. ఢిల్లీలోని అశోకా హోటల్​లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఓటర్ల ప్రాబల్యమున్న లోక్‌సభ స్థానాల్లోనూ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ప్రత్యేకించి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఘన విజయాలను సాధించిందని ఆయన గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రాంతాల్లో ఓటుబ్యాంకును పెంచుకోవడంపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని ఖర్గే చెప్పారు. రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర జరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం, సీట్ల సంఖ్య పెరిగాయని ఆయన తెలిపారు. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించిందన్నారు. మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయలలోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకుందని ఖర్గే చెప్పారు. లోక్​సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నామని ఖర్గే తెలిపారు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో(తెలంగాణ, కర్ణాటక) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రేంజులో..  లోక్​సభ ఎన్నికల్లో మేం ఫలితాలను సాధించలేక పోయాం. అలాంటి రాష్ట్రాల్లో ఫలితాలపై విశ్లేషణ చేసుకుంటాం’’ అని కాంగ్రెస్ చీఫ్(CWC Meeting) చెప్పారు.

Also Read :PM Post : నితీశ్‌ కుమార్‌కు ప్రధాని పోస్ట్.. ఇండియా కూటమి ఆఫర్ : జేడీయూ

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీని నియమించాలని కాంగ్రెస్ నేతలు సీడబ్ల్యూసీ మీటింగ్​లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్​సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ నేత పార్టప్ సింగ్ బజ్వా కోరారు. రాహుల్ ప్రతిపక్ష నేతగా ఉండడంపై తుది నిర్ణయం ఆయనదేనని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలనేది 140 కోట్ల మంది భారతీయుల డిమాండ్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీకి పార్లమెంట్​లో సమాధానం చెప్పగల వ్యక్తి రాహుల్ గాంధీ అని, అందుకే ఆయన లోక్​సభలో ప్రతిపక్ష నేతగా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ సుఖ్వీందర్ సింద్ రంధావా అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,   కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : Ramoji Rao : రామోజీ రావు ను హింసించి హత్య చేసారు – వీహెచ్ సంచలన వ్యాఖ్యలు