Mallikarjun Kharge: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా కుల ప్రాతిపదికన జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. 2021 దశాబ్దపు జనాభా గణనను వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రధాని మోదీని మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు.
2021లో సాధారణ దశాబ్ధ జనాభా గణన జరగాల్సి ఉందని, కానీ అది జరగలేదని ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీన్ని వెంటనే పూర్తి చేసి సమగ్ర కుల గణనను ఇందులో అంతర్భాగంగా చేయాలని సూచించారు. కుల గణన లేనప్పుడు సామాజిక న్యాయ కార్యక్రమాల డేటా అసంపూర్తిగా ఉంటుందని ఖర్గే లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల సామాజిక న్యాయం, సాధికారత పటిష్టం అవుతుందన్నారు. ఈ డిమాండ్‌ను గతంలో ఉభయ సభల్లో చాలాసార్లు లేవనెత్తామని ఆయన అన్నారు. దీంతో పాటు పలువురు విపక్ష నేతలు కూడా ఇదే డిమాండ్ చేశారని ఖర్గే గుర్తు చేశాడు.
కాంగ్రెస్ గవర్నమెంట్ 2011 – 12 సంవత్సర కాలంలో మొదటిసారిగా 25కోట్ల కుటుంబాలకు సామాజిక ఆర్థిక, కుల గణన నిర్వహించిందని గుర్తు చేశారు. 2014 మేలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కుల గణన చేయాలని డిమాండ్ చేసినప్పటికీ కుల డేటాను ప్రచురించలేదని ఖర్గే లేఖలో పేర్కొన్నారు.
బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పటికే కుల ప్రాతిపదికన జనాభా గణనను ప్రకటించారు. దీన్ని రెండు దశల్లో చేస్తామని ప్రకటించగా, ఇప్పటికే మొదటి దశ పూర్తయింది. రెండో దశ జనాభా గణన ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం కుల కోడ్‌లను కూడా జారీ చేశారు. ఒక్కో కులానికి ఒక్కో కోడ్ ఇచ్చారు.
Read More: Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ షురూ!