BJP Vs Shinde : మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమిలో సీట్ల పంపకాల పంచాయితీ ఇంకా తేలలేదు. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ, శివసేన(షిండే) పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. కొన్ని సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల నేతలూ వెనక్కి తగ్గకపోవడంతో అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వివాదా స్పదంగా మారిన ఆయా సీట్లు ఎవరికి దక్కాలనే దానిపై పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఒక పరిష్కారాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
సీఎం షిండే కుమారుడి సీటుకు ఎసరు
మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాలకుగానూ బీజేపీ 29, శివసేన 13, ఎన్సీపీ(అజిత్ పవార్) 6 స్థానాల్లో బరిలోకి దిగాలని తొలుత నిర్ణయించారు. అయితే సీఎం ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన వర్గం 22 సీట్లు కావాలని పట్టుబట్టింది. చివరకు బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగడంతో 13 సీట్లతో సర్దుకునేందుకు ఏక్‌నాథ్ షిండే ఒప్పుకున్నారు. అయితే ఆ తర్వాత కళ్యాణ్, థానే, నాసిక్, సిందుదుర్గ్ రత్నగిరి లోక్‌సభ సీట్ల విషయంలో కొత్త వివాదం మొదలైంది. 2014, 2019 ఎన్నికల్లో ఈ స్థానాల నుంచి శివసేన పోటీ చేసి గెలిచింది. పొత్తులో భాగంగా వీటిని బీజేపీ ఈసారి తీసుకోవాలని భావిస్తోంది. ఈ సారి ఆయా స్థానాల్లో సర్వేలు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ తమ అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవ్వగా.. అందుకు సీఎం షిండే అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. కళ్యాణ్ స్థానం నుంచి ప్రస్తుతం షిండే కుమారుడు శ్రీకాంత్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. దీంతో బీజేపీ ప్రతిపాదనకు అంగీకరిస్తే శివసేన పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతం అందుతుందని, అందుకే ఈ సీట్లపై షిండే(BJP Vs Shinde) పట్టువీడటం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.దీంతో ఈ సీట్ల విషయంలో తదుపరిగా ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read :Manmohan Singh : మహాన్ మన్మోహన్.. పార్లమెంటరీ ప్రస్థానానికి నేటితో తెర
వీలైనంత త్వరగా ప్రకటించాలని..
ఇప్పటికే కాంగ్రెస్ సారథ్యంలోని మహావికాస్ అఘాడీ కూటమి(ఎంవీఏ) తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. కానీ అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో ఇంకా సీట్ల పంపకంపై క్లారిటీ రాకపోవడంతో షిండే వర్గంలోని నేతలు ఆందోళనకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని సీఎం ఏక్‌నాథ్ షిండేను కోరుతున్నారు. రాష్ట్రంలోని మహాయుతి కూటమిలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ఈ పరిణామాలపై శివసేన(ఉద్ధవ్) నాయకుడు రావుసాహెబ్ స్పందిస్తూ.. ‘‘బీజేపీతో చర్చలు జరపడం అంత ఈజీ కాదు. ఈ విషయాన్ని సీఎం షిండే గ్రహించాలి. ఉద్ధవ్ థాక్రే బీజేపీతో సరైన విధంగా వ్యవహరించారు. కానీ షిండే ఫెయిలయ్యాడు’’ అని పేర్కొన్నారు.