Site icon HashtagU Telugu

Gandhiji Historic Places : ఇవాళ గాంధీజీ వర్ధంతి.. ఆయనతో ముడిపడిన 7 చారిత్రక ప్రదేశాలివీ

Mahatma Gandhiji Historic Places Gandhi Death Anniversary

Gandhiji Historic Places : జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి ఇవాళ(జనవరి 30). 1948 జనవరి 30న బిర్లా హౌస్ వద్ద  నాథూరామ్ గాడ్సే అందరూ చూస్తుండగా మహాత్ముడిపై కాల్పులు జరిపాడు. హే రామ్ అంటూ గాంధీజీ ప్రాణాలు విడిచారు. గాంధీ వర్ధంతి రోజును మన దేశంలో షహీద్ దివస్‌‌గా జరుపుకుంటారు.  భారతదేశంలోని గ్రామీణ ప్రజానీకానికి గాంధీజీ ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన భావనలను పరిచయం చేశారు.  ‘ఖాదీ’ ఉద్యమాన్ని ఆయన బాగా ప్రచారం చేశారు. ప్రజలు ఇళ్లలోనే స్పిన్నింగ్ వీల్ (చరఖా)ని ఉపయోగించి సొంతంగా వస్త్రాన్ని  తయారు చేసుకోవడాన్ని గాంధీజీ ప్రజలకు నేర్పించారు. మహాత్మాగాంధీ అమరులైన ఈ రోజున  ఆయనతో ముడిపడిన 7 చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

Also Read :Budget 6 Key Announcements : ఈసారి కేంద్ర బడ్జెట్‌లో 6 కీలక ప్రకటనలు.. ఇవే ?

సబర్మతీ ఆశ్రమం, అహ్మదాబాద్

సబర్మతీ నది ఒడ్డున సబర్మతీ ఆశ్రమం ఉంది.  ఈ ఆశ్రమం 1917 నుంచి 1930 వరకు మహాత్మా గాంధీకి(Gandhiji Historic Places) నివాసంగా ఉంది. సబర్మతీ ఆశ్రమంలో గాంధీజీ  వ్యవసాయం చేసేవారు. చరఖాతో దుస్తులు నేసుకునేవారు. పాఠశాలను నడిపేవారు.

కీర్తి మందిర్, పోర్‌బందర్

కీర్తి మందిర్ అనేది మహాత్మా గాంధీ స్మారక నిలయం. ఇది పోర్‌బందర్‌లో ఉంది. గాంధీజీ పోర్‌బందర్‌లోనే జన్మించారు. ఈ నిలయాన్ని గాంధీజీ పూర్వీకుల ఇంటి పక్కనే నిర్మించారు. ఈ భవనంలో గాంధీయిజంపై పుస్తకాలతో  గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.

కొచ్రాబ్ ఆశ్రమం

గాంధీజీ నిర్మించిన మొదటి ఆశ్రమం కొచ్రాబ్. ఇది గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం సమీపంలో ఉంది. సత్యాగ్రహం, స్వావలంబన, స్వదేశీ భావన కలిగిన ప్రజలు, పేదలు, పేద మహిళలు, అంటరాని వారి అభ్యున్నతి కోసం ఈ ఆశ్రమాన్ని నిర్మించారు.  మీరు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పిల్లలతో ఇక్కడికి వెళ్లొచ్చు.

Also Read :Hyderabad Student: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాదీ విద్యార్థి మృతి

గాంధీ స్మృతి భవన్, న్యూఢిల్లీ

గాంధీ స్మృతి భవన్‌ను గతంలో బిర్లా హౌస్ లేదా బిర్లా భవన్ అని పిలిచేవారు. మహాత్మా గాంధీ హత్యకు ముందు తన జీవితంలోని చివరి 144 రోజులు గడిపింది గాంధీ స్మృతి భవన్‌లోనే. వాస్తవానికి ఇది బిర్లా వ్యాపార కుటుంబానికి చెందిన ఆస్తి. ఇప్పుడిది జాతిపిత మహాత్మా గాంధీకి అంకితం చేయబడింది. మ్యూజియంగా మారింది.

నేషనల్ గాంధీ మ్యూజియం, న్యూఢిల్లీ

ఢిల్లీలోని రాజ్‌ఘాట్ ప్రాంతంలో నేషనల్ గాంధీ మ్యూజియం ఉంది. మహాత్మా గాంధీ జీవితం, సేవల విశేషాలను తెలియపర్చేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. గాంధీజీ హత్య జరిగిన వెంటనే ఈ మ్యూజియంను తెరిచారు. మహాత్మా గాంధీ వ్యక్తిగత జ్ఞాపకాలు, కళాఖండాలు ఇందులో ఉన్నాయి.

గాంధీ మెమోరియల్ మ్యూజియం, మదురై

భారత జాతిపిత మహాత్మా గాంధీ 1948లో హత్యకు గురయ్యారు.  తమిళనాడులోని మదురైలో 1959లో గాంధీ మెమోరియల్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఇందులో గాంధీజీకి సంబంధించిన అనేక స్మారక చిహ్నాలను అందుబాటులో ఉంచారు.  గాంధీజీ రక్తపు మరకలతో కూడిన హత్య దుస్తులలో కొంత భాగాన్ని ఈ మ్యూజియంలో భద్రపరిచారు.

మణి భవన్ గాంధీ సంగ్రహాలయ, ముంబై

మణిభవన్ గాంధీ సంగ్రహాలయం ముంబైలో ఉంది.   1917 నుంచి 1934 వరకు 17 ఏళ్లపాటు ముంబైలోని మణిభవన్ కేంద్రంగా గాంధీజీ కార్యకలాపాలు నిర్వహించారు. ఇది రెండు అంతస్తుల భవనం. నగరంలోని గందేవి ప్రాంతంలో మణిభవన్ ఉంది. ఇప్పుడు అందులోనే మ్యూజియంను ఏర్పాటు చేశారు. దీనిలో గాంధీజీకి సంబంధించిన పుస్తకాలు, ఫొటోలు ఉన్నాయి.