Site icon HashtagU Telugu

Mahashivudu: భూ కబ్జా కేసు.. కోర్టుకు హాజ‌రైన మ‌హాశివుడు..!

Lord Shiva Land Grab Case

Lord Shiva Land Grab Case

భూ కబ్జా కేసులో సాక్షాత్తు పరమశివుడిపైనే ఆరోపణలు రావడంతో, మ‌హాశివుడు (శివలింగం) కోర్టుకు హాజ‌ర‌వ‌డం విశేషం. వినడానికి కాస్త షాకింగ్‌గా ఉన్నా, ఇదే నిజం. ఓ భూ కబ్జా కేసుకు సంబంధించి నిందితుల‌త‌తో పాటు శివాల‌యానికి కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే ఆ నోటీసు శివాలయానికి బదులు శివుడికి వెళ్లింది. ఈ క్ర‌మంలో విచారణకు హాజరయ్యేవారంతా తమతోపాటు శివలింగాన్ని కూడా రిక్షాపై తీసుకెళ్లారు.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్ గఢ్‌లో జరిగిన ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే.. చత్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్ లో 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే బిలాస్ పూర్ హైకోర్టులో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఓ పిటిషన్ వేశారు. ఈ క్ర‌మంలో ఆ భూమిలో ఉన్న శివాలయం సహా 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నేప‌ధ్యంలో వెంటనే రంగంలోకి దిగిన అక్క‌డి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం అధికారులు, ప్రాథమిక విచారణ జ‌రిపిన అనంతరం 10 మందికి నోటీసులిచ్చారు. ఈ క్ర‌మంలో మార్చి ఈనెల 25న జరిగే విచారణకు వచ్చి భూ క‌బ్జా కేసు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విచారణకు హాజరుకాకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని, భూమిని ఖాళీ చేయించి 10 వేల జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో శివుడితోపాటు నోటీసులు అందుకున్నవారు కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ క్ర‌మంలో త‌మ‌తో పాటు గుడిలోని శివలింగాన్ని రిక్షాలో కోర్టుకు తీసుకొచ్చి హాజరు పరిచారు.