Maharastra: భర్త చనిపోయినా బొట్టు, గాజులు తీయక్కర్లేదంటూ తీర్మానం

హిందూ సంప్రదాయం ప్రకారం భర్త చనిపోతే భార్య తాను ధరించే మంగళసూత్రం, బొట్టు, గాజులు తీసేస్తుంది.

  • Written By:
  • Updated On - May 10, 2022 / 02:43 PM IST

హిందూ సంప్రదాయం ప్రకారం భర్త చనిపోతే భార్య తాను ధరించే మంగళసూత్రం, బొట్టు, గాజులు తీసేస్తుంది. నిజానికి ఇంతటి శిక్ష మహిళలకు తప్పదా.. కాలంతోపాటు సంప్రదాయాలు, కట్టుబాట్లు మారవా అని ఆధునికవాదులు ప్రశ్నిస్తారు. వీళ్ల మాటేమో కాని.. మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లా షిరోల్ తాలూకాలో ఉన్న హెర్ వాడ్ గ్రామం మాత్రం ఓ తీర్మానం చేసింది. ఇప్పుడు దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది. భర్త మరణంతో పుట్టెడు కష్టంలో ఉండే మహిళపై ఇలాంటి సంప్రదాయాలు తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని ఈ గ్రామస్థులు భావించారు. అందుకే మనిషిని విపరీతమైన శోకానికి గురిచేసే ఇలాంటి సంప్రదాయాలు ఇక పాటించక్కరలేదంటూ హెర్ వాడ్ గ్రామం ఏకాభిప్రాయంతో మే 4న తీర్మానం చేసింది. దానిని గ్రామ పంచాయతీ కూడా ఏకగ్రీవంగానే ఆమోదించింది.

కరోనా సమయంలో ఎదుర్కొన్న కష్టనష్టాలే ఈ నిర్ణయానికి కారణమని గ్రామస్థులు అంటున్నారు. ఎందుకంటే కరోనా రక్కసికి.. ఈ గ్రామంలోని పాతికేళ్లలోపు యువకులు ఎక్కువగా మృత్యువాత పడ్డారు. దీంతో వారిని పెళ్లిచేసుకున్న వారు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే ఆ మహిళలకు వచ్చిన కష్టాన్ని చూసి గ్రామమంతా చలించిపోయింది. భర్త చనిపోయిన తరువాత అతడి భార్యను శుభకార్యాలకు ఆహ్వానించకపోవడం, ఇతరత్రా కట్టుబాట్ల పేరుతో కట్టడి చేయడంతో ఈ ఊరివాళ్లు ఆవేదన చెందారు. అందుకే గ్రామ సర్పంచ్ శ్రీగోండ పాటిల్ ఈ తీర్మానానికి ప్రయత్నించారు. కానీ దీనికి నిజమైన కృషి చేసినవారు.. అంగన్ వాడీ సేవికాస్, ఆశా వర్కర్లు అంటారాయన. దీని వెనుక మహాత్మా ఫూలే సోషల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ప్రమోద్‌ జింగాడే పాత్ర కూడా ఉంది. ఈ గ్రామ నిర్ణయంపై మంత్రి సతేజ్ పాటిల్ కూడా పాజిటివ్ గా స్పందించారు.