Aurangzeb : మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కొనియాడుతూ మహారాష్ట్రలోని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ ఆజ్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను రాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఆజ్మీ వ్యాఖ్యలను మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ ఖండించాయి. ఆజ్మీని తమ రాష్ట్రానికి పంపిస్తే తగిన చికిత్స చేస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాత్రం ఆజ్మీని సమర్ధించారు.
అబూ ఆజ్మీ ఏమన్నారు ?
‘‘ఆనాడు రాజులంతా అధికారం కోసం, సంపద కోసం పాకులాడారు. పోరాడారు. అందులో మతపరమైన కోణమేదీ లేదు. ఔరంగజేబ్ 52 ఏళ్ల పాటు పాలన సాగించాడు. ఒకవేళ ఆయన హిందువులను ముస్లింలుగా మార్చి ఉంటే, ఎంతమంది ముస్లింలుగా మారి ఉండేవారో మనం అంచనా వేసుకోవచ్చు. ఔరంగజేబ్(Aurangzeb) గుడులతో పాటు మసీదులను కూడా కూల్చాడు. ఒకవేళ హిందూ వ్యతిరేకిగా పనిచేసి ఉంటే, 34 శాతం మంది హిందువులు ఔరంగజేబ్ వెంట ఉండేవారే కాదు. ఆయన సలహాదారుల్లో హిందువులు ఉండేవారే కాదు. ప్రతీదానికి హిందూ, ముస్లిం కోణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ దేశం రాజ్యాంగం ఆధారంగా నడుస్తుంది. నేను హిందూ సోదరులకు వ్యతిరేంగా ఒక్క పదం కూడా మాట్లాడలేదు’’ అని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ ఆజ్మీ వ్యాఖ్యానించారు.
పై వ్యాఖ్యలపై అబూ ఆజ్మీ వివరణ
తాను చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడంతో అబూ ఆజ్మీ వివరణ ఇచ్చుకున్నారు. ‘‘శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్‌లకు వ్యతిరేకంగా మాట్లాడాలని నేను అనుకోలేదు. నా మాటలను వక్రీకరించారు. ఔరంగజేబు గురించి చరిత్రకారులు, రచయితలు చెప్పిందే నేను చెప్పాను. నేను ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ లేదా మరే ఇతర గొప్ప వ్యక్తి గురించి ఎటువంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.
Also Read :Bofors Scam: బోఫోర్స్ స్కాం.. ఒక్క సాక్ష్యంపై సీబీఐ కన్ను.. అమెరికాకు రిక్వెస్ట్
థానేలో కేసు నమోదు
ఔరంగజేబుపై చేసిన వ్యాఖ్యలకుగానూ మహారాష్ట్రలోని థానేలో అబూ అజ్మీపై కేసు నమోదైంది. ‘‘17వ శతాబ్దపు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును క్రూరమైన, నిరంకుశ పాలకుడిగా నేను భావించను. ఈ రోజుల్లో ఆ మొఘల్ చక్రవర్తి చరిత్రను వక్రీకరించే సినిమాలు వస్తున్నాయి’’ అని అబూ ఆజ్మీ వ్యాఖ్యానించారంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు.